Farmer Scam: రైతులకు 300 కోట్ల టోకరా
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:53 AM
ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసగించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడిన కేసుల్లో నిందితుడు, అంతర్రాష్ట మోసగాడు మోరంశెట్టి....
అంతర్రాష్ట కేడీ దాల్‌మిల్ సూరి అరెస్టు
పుట్టపర్తి రూరల్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసగించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడిన కేసుల్లో నిందితుడు, అంతర్రాష్ట మోసగాడు మోరంశెట్టి సురేశ్ అలియాస్ దాల్‌మిల్ సూరిని తెలంగాణలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దాల్ మిల్ సూరిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో 57 కేసులు ఉన్నాయని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలను పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఆయన వివరించారు. పోలీసుల కథనం ప్రకారం, శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు పట్టణానికి చెందిన దాల్‌మిల్ సూరి రైతులకు అధిక లాభాలను ఆశ చూపి, అప్పుమీద వారు పండించిన ధాన్యం తీసుకునేవాడు. ఆ తరువాత డబ్బులు ఎగ్గొట్టేవాడు. ఇలా రైతులు, వ్యాపారులను మోసగించి రూ.300 కోట్లకు పైగా దోచేశాడు. ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యం చేసేవాడు. ఆరునెలల క్రితం భూమి విషయంలో కొత్తచెరువులో గొడవ జరిగింది. ఈ ఘటనలో దాల్‌మిల్ సూరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఒక్క సత్యసాయి జిల్లాలోనే ఇతనిపై 26 కేసులు ఉన్నాయి. మొత్తంగా 57 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో దాల్‌మిల్ సూరితోపాటు తమ్ము డు పాండు, కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. దాల్‌మిల్ సూరిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుడు హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ కావడంతో కేసు మరింత బలపడిందన్నారు. నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయనున్నట్టు తెలిపారు.