Share News

AP Govt: కలెక్టర్లకు మరింత పవర్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:06 AM

జిల్లాల అభివృద్ధిలో కలెక్టర్లది కీలక పాత్ర. అన్ని శాఖలపైనా వారికి పట్టు ఉంటుంది. కానీ, అధికారాలు మాత్రం కొన్నే ఉంటాయి. కీలకమైన అంశాల్లో చాలా పరిమితమైన అధికారాలే ఇచ్చారు. దీంతో ఇప్పటికీ పలు విషయాల్లో...

AP Govt: కలెక్టర్లకు మరింత పవర్‌

  • భూ కేటాయింపుల్లో మరింత అధికారం

  • విస్తీర్ణం, ధర నిర్ణయంలో కీలక పాత్ర

  • ప్రభుత్వ సంస్థలకు 15 ఎకరాల వరకు కేటాయించే వెసులుబాటు

  • అధికారాలు పెంచనున్న రెవెన్యూ శాఖ

  • జిల్లాల్లో అభివృద్ధే లక్ష్యంగా నిర్ణయాలు

  • త్వరలో సర్కారుకు ప్రతిపాదనలు

జిల్లాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారులుగా ఉన్న కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలకు, విభాగాలకు, ప్రైవేటు సంస్థలకు కూడా 10-15 ఎకరాల మేరకు భూములు కేటాయించే అధికారాన్ని కలెక్టర్లకే ఇవ్వనుంది. తద్వారా ప్రాజెక్టులు, పనులు కూడా సత్వరమే సాకారం అవుతాయని, ఫలితంగా జిల్లాలు వడివడిగా అభివృద్ధి పథంలో పరుగులు పెడతాయని భావిస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జిల్లాల అభివృద్ధిలో కలెక్టర్లది కీలక పాత్ర. అన్ని శాఖలపైనా వారికి పట్టు ఉంటుంది. కానీ, అధికారాలు మాత్రం కొన్నే ఉంటాయి. కీలకమైన అంశాల్లో చాలా పరిమితమైన అధికారాలే ఇచ్చారు. దీంతో ఇప్పటికీ పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ విభాగాధిపతులు, కార్యదర్శుల స్థాయి నిర్ణయాల కోసం కలెక్టర్లు ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్‌ స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న కొన్ని అంశాలు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతమయ్యాయి. దీంతో కొన్ని ముఖ్యమైన అంశాల్లో జిల్లా కలెక్టర్‌ కూడా ఏమీచేయలేక పోతున్నారు. ముఖ్యంగా భూ సంబంధిత విషయాల్లో నిర్ణయాల కోసం ప్రభుత్వం వద్దకు పరిగెత్తాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో.. 2012లో ఆంధ్రప్రదేశ్‌ భూ కేటాయింపు పాలసీని ఖరారు చేసే సమయంలోనే ఈ అంశంపై చర్చ జరిగింది. భూ సంబంధిత విషయాల్లో కలెక్టర్లకు అధికారం ఇచ్చే అంశంపై అప్పట్లోనే దృష్టి పెట్టారు. కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


భూకేటాయింపుల ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో కేంద్రీ కృతం చేశారు. ఇప్పుడు ఆ విధానం వచ్చి 13 ఏళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు కీలక అధికారాలు ఇచ్చి, కొన్ని అంశాల్లో పాలనా నిర్ణయాలను మరింత సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు వాటికి అవసరం ఉన్న మేరకు భూములను జిల్లా స్థాయిలోనే కలెక్టర్‌ కేటాయించేలా, ఆ భూముల ధరలను నిర్ణయించేలా అధికారం కల్పించాలని భావిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ సంస్థలకు 5 ఎకరాల మేరకు భూమిని కేటాయించే అధికారం కలెక్టర్లకు ఉంది. అదేవిధంగా భూమి ధరను రూ.50 లక్షల వరకు ఖరారు చేసే అధికారం కూడా ఇచ్చారు. కానీ, రాష్ట్రస్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భూ నిర్వహణ సంస్థ(ఏపీఎల్‌ఎమ్‌ఏ) ఆ బాధ్యతను తీసుకుంది. దీంతో కలెక్టర్లకు అధికారం ఉన్నా అది ఆచరణలోకి రాలేదు. ఫలితంగా కలెక్టర్లు ఇప్పటికీ భూ సంబంధిత కీలక ప్రతిపాదనలు ఏపీఎల్‌ఎమ్‌ఏకే పంపిస్తున్నారు.


ప్రతిపాదనలు సిద్ధం: జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు భూములు ఇవ్వడం, ధరను ఖరారు చేయడం వంటి అధికారాలను కలెక్టర్లకు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఒకవేళ ఇప్పటికే ఆ అధికారాలు ఉంటే మరింతగా వాటిని పెంచి అమలు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా రెవె న్యూ శాఖ తాజాగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా అభివృద్ధికి అవసరమైన మేరకు ప్రభుత్వ విభాగా లు, సంస్థలు, ఇతర అవసరాలకు భూములు కేటాయించే అధికారం కలెక్టర్లకే ఉండాలని, అది సరిగ్గా అమలుకాని పక్షంలో ఇకపై ఖచ్చితంగా అమలయ్యేలా విధివిధానాలు ఉండాలని రెవెన్యూశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభు త్వ సంస్థలు, కార్పొరేషన్లు, విభాగాలు, పరిశ్రమ లు, ఇతర అవసరాలకు భూములు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు ఉండాలని స్పష్టం చేసింది. అయితే, ఎవరికి ఎంత భూమి కేటాయించే అధికారం ఉండాలి?. వాటి ధరను ఎంత మేరకు కలెక్టర్‌ ఖరారు చేసే అధికారం ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.


ప్రతిపాదనల్లోని కీలక అంశాలు

1. ప్రభుత్వ పాఠశాల, కాలేజీ, ఆస్పత్రులు, ఆఫీసు భవనాల కోసం జిల్లాస్థాయిలో 10-15 ఎకరాలు, అంతకుమించి కేటాయించే అధికారం.

2) కేటాయించే భూమి ధరను సగటున ఎకరం రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖరారు చేసే అధికారం.

3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వ్యవస్థలకు వాటి ప్రాథమిక అవసరాలను బట్టి కలెక్టర్‌ 10-15 ఎకరాలకు కేటాయించే అధికారం.

4) ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు భూములు ఇవ్వాలనుకుంటే, అందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయిలో ఏపీఎల్‌ఎమ్‌ఏ ఆమోదానికి కలెక్టర్‌ నివేదించాలి.

5) ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదం కోసం ఏపీఎల్‌ఎమ్‌ఏ ఫైలును పంపించాలి.

Updated Date - Aug 25 , 2025 | 05:09 AM