Share News

Deputy CM Pawan Kalyan: పంచాయతీల ప్రక్షాళన

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:25 AM

పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా ఉన్న లోపభూయిష్ఠ పరిపాలన, విధానాలను ప్రక్షాళన చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan: పంచాయతీల ప్రక్షాళన

  • లోపభూయిష్ఠ విధానాలకు చెల్లుచీటీ

  • ఐదు దశాబ్దాల సిబ్బంది నమూనాలో మార్పులు

  • జనాభా, ప్రాంతం, ఆదాయ ప్రాతిపదికన గ్రేడ్లు

  • క్లస్టర్‌ విధానం రద్దు.. గ్రేడ్ల వారీగా సెక్రటరీలు

  • సిబ్బంది సర్దుబాటుతో ఉత్తమ ఫలితాలు రాబట్టాలి

  • పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి సాధించాలి

  • అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ దిశానిర్దేశం

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా ఉన్న లోపభూయిష్ఠ పరిపాలన, విధానాలను ప్రక్షాళన చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. 48 ఏళ్ల నాటి సిబ్బంది నమూనాయే ఇప్పటికీ అమల్లో ఉందని, ఈ విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ఉందని చెప్పారు. పంచాయతీల్లోనూ పట్టణ స్థాయి ప్రగతి సాధించాలన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయశాఖల ఉన్నతాధికారులతో పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణ, నూతన సంస్కరణల అమలుపై సమీక్ష చేశారు. ప్రస్తుతం పంచాయతీల్లో అమలు చేస్తున్న విధానాలు, వాటిలో లోపాలు, చేయాల్సిన మార్పులు చేర్పులపై అధికారులు వివరించారు. నూతనంగా అమలు చేయనున్న ప్రణాళికలపై పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. గ్రేడ్లు నిర్ణయానికి ఆదాయమే ప్రాతిపదిక కాదన్నారు. గతంలో ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించేవారని, ప్రస్తుతం జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేతర ప్రాంతం, ఆదాయ అంశాలను విశ్లేషించుకుని నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నామని చెప్పారు. ప్రస్తుత క్లస్టర్‌ విధానంలో రెండు మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలను ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారని, నూతన విధానంలో ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా సెక్రటరీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. త్వరలో క్యాబినెట్‌ ముందుకు ఈ నిర్ణయాలు తీసుకెళతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు ఎప్పటికప్పుడు పంచాయతీ ఖాతాల్లో వేశామని వెల్లడించారు. ఏళ్లుగా పదోన్నతుల వ్యవహారం పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను మన్నించి 10 వేలకు మందికిపైగా ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమం చేశామన్నారు.


సర్పంచ్‌ల గౌరవం నిలబెట్టేలా..: మంత్రిగా పవన్‌ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి పంచాయతీల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కోల్పోయిన సర్పంచుల గౌరవం నిలబెట్టేలా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచామని చెప్పారు. మైనర్‌ పంచాయతీలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 100 నుంచి రూ. 10 వేలకు, మేజర్‌ పంచాయతీలకు రూ. 250 నుంచి రూ. 25 వేలకు పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, ఓఎ్‌సడీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 07:26 AM