Share News

AP Panchayat Raj Reform: పంచాయతీ ప్రక్షాళన

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:42 AM

కూటమి సర్కారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ ప్రక్షాళనలో వేగం పుంజుకుంది. ఉద్యోగుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్‌లో...

AP Panchayat Raj Reform: పంచాయతీ ప్రక్షాళన

  • 4 గ్రేడ్లుగా 13,351 గ్రామ పంచాయతీల విభజన.. అధిక జనాభా ఉన్న 359 రూర్బన్‌ పంచాయతీలు

  • మిగిలినవి గ్రేడ్‌-1, 2, 3గా గుర్తింపు

  • మరో సంస్కరణకు మంత్రివర్గం ఆమోదం

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కూటమి సర్కారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ ప్రక్షాళనలో వేగం పుంజుకుంది. ఉద్యోగుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజముద్ర పడగా, తాజాగా రెండో విడత సంస్కరణలకు శుక్రవారం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గతంలో పంచాయతీలను 7,244 క్లస్టర్లుగా గుర్తించారు. ఇకనుంచి ప్రతి పంచాయతీ స్వతంత్ర పంచాయతీగా కొనసాగనుంది. ఇప్పటికే పంచాయతీల పునర్విభజన కోసం నియమించిన కమిటీ 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 పంచాయతీలుగా గుర్తిస్తారు. అధిక జనాభా, ఆదాయం కలిగిన 359 గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించి, వాటికి అధికారులుగా గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి నియమిస్తారు. ఇకనుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓ)గా పిలవనున్నారు. రూర్బన్‌ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్‌ అధికారులను నియమిస్తారు. ఆ 359 పంచాయతీల్లో ఉన్న 1097 మంది జూనియర్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ బిల్లు కలెక్టర్లలో సీనియారిటీ బట్టి 359 మందికి పదోన్నతులు కల్పిస్తారు. వారిని రూర్బన్‌ పంచాయతీల్లోనే సీనియర్‌ అసిస్టెంట్‌లుగా నియమించి పాలనను మరింత మెరుగుపరచనున్నారు. పంచాయతీల విభజనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.


మున్సిపాలిటీల తరహాల్లో విభాగాలు

పంచాయతీరాజ్‌ ప్రక్షాళనలో భాగంగా మంత్రిమండలి ఆమోదించిన మేరకు మున్సిపాలిటీ తరహాలో గ్రామ పంచాయతీల్లోనూ పలు విభాగాలు ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీల్లో ఆయా విభాగాల ద్వారా సేవలందించినట్లే.. గ్రామ పంచాయతీల్లోనూ పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలు అందుబాటులోకి తెస్తారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక విభాగం, వీధిలైట్లు విభాగం, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాలుగా విభజించనున్నారు. ఈ విభాగాల ద్వారా సేవలందించేందుకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకోవచ్చు. వారికి గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచి జీతాలు చెల్లిస్తారు. అదనంగా ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లను ఇక గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా గుర్తించి వారి సేవలను వినియోగించుకుంటారు. వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో భవనాలు, లేఅవుట్‌ రూల్స్‌ అమలు చేస్తారు. మినిస్టీరియల్‌, ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి సమానంగా పదోన్నతుల చానల్‌ను కూడా రూపొందిస్తారు. పంచాయతీరాజ్‌లో ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అదనంగా ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర అర్హత కలిగిన సిబ్బందిని ఉపయోగించి గ్రామ పంచాయతీల్లో డిజిటల్‌ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులు డిజిటలైజ్‌ చేసి రియల్‌టైమ్‌లో గ్రామ పంచాయతీల ద్వారా సర్వీసులు అందించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయిస్తూ కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్‌ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే 2 రకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరో 10 రకాల సంస్కరణలకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మార్పులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు రూపొందించిన సంస్కరణ ప్రక్రియను సానుకూలంగా స్వాగతించిన ముఖ్యమంత్రి.. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, అధికారులకు సూచించినట్లు సమచారం. కాగా, పంచాయతీరాజ్‌ ప్రక్షాళనలో మొదట ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత మిగిలిన సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అందుకే మొదట ఉద్యోగుల క్యాడర్‌ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రక్షాళనలో అతి ముఖ్యమైన సర్వీసు విషయాలపై ముందు దృష్టి సారించారు.

Updated Date - Oct 11 , 2025 | 05:43 AM