Share News

National Water Development Agency: ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:08 AM

తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లి కావేరి నదితో అనుసంధానం చేస్తామంటే అంగీకరించేది లేదని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేయనుంది.

National Water Development Agency: ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు

  • 200 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వాడేసుకుంటుంది

  • గోదావరి-కావేరి అనుసంధానంపై ఏపీ స్పష్టీకరణ.. నేడు ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లి కావేరి నదితో అనుసంధానం చేస్తామంటే అంగీకరించేది లేదని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేయనుంది. దీనివల్ల మహారాష్ట్రకు ముంపు సమస్య ఏర్పడుతుందని.. అలాగే ఈ పథకం ఆధారంగా 200 టీఎంసీల గోదావరి జలాలను వాడుకోవాలని తెలంగాణ భావిస్తోందని మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగే జాతీయ జలాల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశానికి తెలియజేయనుంది. ఈ భేటీకి కార్యదర్శుల స్థాయి అధికారులు హాజరు కావాలని కేంద్రం స్పష్టం చేయగా.. రాష్ట్రం నుంచి సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర నదీ జలాల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకరరావు తదితరులు హాజరు కానున్నారు. మహానది-కావేరి అనుసంధానంలో భాగంగా తెలంగాణలోని ఇచ్చంపల్లి (తుపాకుల గూడెం) నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గోదావరి- కావేరి అనుసంధానంలో భాగంగా 200 టీఎంసీలను వాడుకునేలా కార్యాచరణ సిద్ధం చేసింది కూడా. గోదావరి జలాలను నాగార్జున సాగర్‌ దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచి కావేరికి తరలించాలని తెలంగాణ సూచిస్తోంది. ఇందుకోసం ఛత్తీ్‌సగఢ్‌ ఇప్పటిదాకా వాడుకోని 147 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి-కావేరి అనుసంధానానికి వినియోగించుకోవచ్చని కేంద్ర జలశక్తి శాఖ చెబుతోంది. అయితే ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. తమకు కేటాయించిన 147 టీఎంసీలు వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్రానికి ఇటీవల సమాచారం ఇచ్చింది.


కానీ ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి పదేళ్లు పడుతుందని.. ఆలోగా అనుసంధాన పథకానికి ఆ 147 టీఎంసీలను వినియోగిస్తామని కేంద్రం అంటోంది. గోదావరిలో తమ వాటాను ఇచ్చేందుకు ఛత్తీ్‌సగఢ్‌ తిరస్కరిస్తుంటే.. అదే ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రశ్నిస్తోంది. గతలో ధవళేశ్వరం-కావేరి అనుసంధాన పథకానికి కేంద్రమే రూపకల్పన చేయడాన్ని గుర్తుచేస్తోంది. తాము ఇప్పటికే పోలవరం-బనకచర్ల పథకానికి ప్రణాళిక రచించినందున.. దీని ద్వారా గోదావరి-కావేరి అనుసంధానం అమలు చేయాలని మంగళవారం నాటి సమావేశంలో పట్టుబట్టనుంది. ఇచ్చంపల్లి-కావేరి పథకం అమలుకు నీటి నిల్వ చేయాల్సి ఉంటుందని.. అదే జరిగితే మహారాష్ట్రకు బ్యాక్‌వాటర్‌ సమస్య ఎదురవుతుందని చెబుతోంది. మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముంపు ప్రాంత రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా గోదావరి-కావేరి అనుసంధానం కార్యాచరణ మొదటికొస్తుందని స్పష్టంచేస్తోంది.

Updated Date - Dec 23 , 2025 | 04:10 AM