AP Non-Gazetted Govt Officers: అపరిష్కృత సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:59 AM
ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని, వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చటానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీఎన్జీజీవో అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగులలో అసంతృప్తిని చల్లార్చండి
సీఎంకు ఏపీఎన్‌జీజీవో నేతల విజ్ఞప్తి
సీఎస్‌తో ఏపీజీఈఏ నేతల సమావేశం
విజయవాడ/అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని, వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చటానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీఎన్జీజీవో అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఏపీఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను సీఎం దగ్గర ప్రస్తావించారు. ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన, వారి మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, చాలావరకు అపరిష్కృతంగా ఉండిపోయాయని విద్యాసాగర్ ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. పీఆర్‌సీ, డీఏ ప్రకటనల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ దశలవారీగా పరిష్కరిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. సింగపూర్ పర్యటన తర్వాత ఉద్యోగుల సమస్యలపై చర్చిద్దామని చెప్పినట్టు తెలిసింది.
ఈహెచ్‌ఎస్ పథకంపై...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సచివాలయంలో సీఎస్ విజయానంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎ్‌స పథకం కింద మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంఘాల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని, ప్రధాన గుర్తింపు సంఘాన్ని ఉద్యోగులు నేరుగా ఎన్నుకునే విధానాన్ని రూపొందించాలని, రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని సూర్యనారాయణ కోరారు. ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్, సహ అధ్యక్షులు సుగుణ తదితరులు పాల్గొన్నారు.