Share News

Navodaya Schools: ఏపీ నవోదయల్లో 42 శాతం పోస్టులు ఖాళీ

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:54 AM

ఏపీలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను 171 పోస్టులు(42శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్‌ చౌదరి సమాధానం ఇచ్చారు.

Navodaya Schools: ఏపీ నవోదయల్లో 42 శాతం పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను 171 పోస్టులు(42శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్‌ చౌదరి సమాధానం ఇచ్చారు. అలాగే 322 బోధనేతర సిబ్బంది పోస్టులకు 155 (48శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ఒక ప్రశ్నకుసమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకుగాను ఏలూరు సహా 13 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉన్నాయని మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో 1,118 గిరిజన గ్రామాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పాల ధరలను స్థానిక సహకార, ప్రైవేటు డెయిరీ సంస్థలే నిర్ణయిస్తున్నాయని మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ సమాధానమిచ్చారు.

ఏపీకి 1.94 లక్షల కోట్ల కేసీసీ రుణాలు

ఏపీలో గత 3 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం 1.04 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కేసీసీ) రుణ ఖాతాలు వ్యవసాయ పనుల కోసం ఆర్థిక సహాయం పొందాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి రామనాథ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ మూడేళ్లలో మొత్తం రూ1.94 లక్షల కోట్లకు పైగా రుణాలు కేసీసీల ద్వారా మంజూరయ్యాయని అని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఆమోదం

ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్స్‌ పథకం కింద 2015లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో తారకేశ్వర టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందని కేంద్ర జౌళి సహాయ మంత్రి పబిత్ర మార్గరెటా లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

Updated Date - Dec 03 , 2025 | 05:54 AM