AP Municipal Workers: 2 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:43 AM
ఆగస్టు 2 నుంచి మున్సిపల్ సిబ్బంది సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆసుల రంగనాయకులు, పోరుమావిళ్ల సుబ్బరాయుడు తెలిపారు.
డైరెక్టర్‌కు నోటీసులు అందజేత
అమరావతి, విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు 2 నుంచి మున్సిపల్ సిబ్బంది సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆసుల రంగనాయకులు, పోరుమావిళ్ల సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ మున్సిపల్ డైరెక్టర్ మురళీకృష్ణగౌడ్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ‘ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు, ఆఫీసు సిబ్బందికి, పార్కు కూలీలకు వేతనాలు పెంచాలి. పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. డీఏలు, సరెండర్ లీవ్‌ల ఎన్‌క్యాష్‌మెంట్ విడుదల చేయాలి. రిటైర్డ్ కార్మికుల గ్రాట్యుటీ చెల్లించాలి. కార్మికులపై పనిభారం అధికమెనప్పటికీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు. దీనిని నిరసిస్తూ ఆగస్టు 1 వరకు ప్రభుత్వానికి గడువిచ్చి 2వ తేదీ నుంచి సమ్మె చేపడతామ’ని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజారోగ్యం దెబ్బతినకుండా కార్మిక సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని రంగనాయకులు ప్రభుత్వాన్ని కోరారు.