Share News

Municipal Guidelines: ఆఫ్‌లైన్‌ లేఅవుట్లకు తిరిగి అనుమతులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:26 AM

ఆన్‌లైన్‌ పద్ధతి రాకముందు మంజూరైన ఆఫ్‌లైన్‌ లేఅవుట్లకు మళ్లీ అనుమతులు ఇవ్వాలని మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆలస్యపు ఫీజుతో కూడిన ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 870 లేఅవుట్లకు తిరిగి అనుమతులు లభించే అవకాశం ఉంది.

Municipal Guidelines: ఆఫ్‌లైన్‌ లేఅవుట్లకు తిరిగి అనుమతులు

ఆలస్యపు ఫీజు వసూలుకు నిర్ణయం

మున్సిపల్‌ శాఖ మార్గదర్శకాలు జారీ

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో ఆన్‌లైన్‌ లేఅవుట్ల అనుమతి ప్రక్రియ రాకముందే ఉన్న ఆఫ్‌లైన్‌ లేఅవుట్లకు తిరిగి అనుమతులు మంజూరుచేస్తూ మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. గతంలో పలు పట్టణాలు, నగరాల్లో లేఅవుట్లు వేశాక రెండేళ్ల పాటు అభివృద్ధి చేయకుండా ఆగిపోయిన వాటిని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా ఫీజులు పెంచడంతో పాటు రియల్‌ బూమ్‌ లేకపోవడంతో పలు చోట్ల లేఅవుట్లను అభివృద్ధి చేయకుండా వదిలేశారు. ప్రస్తుతం లేఅవుట్లకు గిరాకీ పెరిగింది. దీంతో ఆగిపోయిన వాటికి తిరిగి అనుమతులివ్వాలని పలువురు రియల్టర్లు మంత్రి నారాయణను కోరారు. దీంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయా లేఅవుట్ల అనుమతి గడువు పూర్తయిన తర్వాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలస్యపు ఫీజు వసూలు చేసి వాటికి తిరిగి అనుమతులిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2-20 ఏళ్ల మధ్య 870 ఆఫ్‌లైన్‌ లేఅవుట్లకు సంబంధించి 8,509 ఎకరాలకు తిరిగి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మున్సిపాలిటీలకు ఫీజుల రూపంలో ఆదాయం చేకూరనుంది.

Updated Date - Apr 22 , 2025 | 04:26 AM