Deputy CM Pawan: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:53 AM
మొంథా తుఫాను నేపథ్యంలో ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలంటూ పలువురు మంత్రులు అధికారులను అప్రమత్తం చేశారు.
కాకినాడ కలెక్టర్, అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్
ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ఉండండి: మంత్రి లోకేశ్
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను నేపథ్యంలో ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలంటూ పలువురు మంత్రులు అధికారులను అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను, అత్యాయిక స్థితిలో స్పందించాల్సిన తీరును టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ఎలాంటి భయాందోళనలు వద్దని, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నారాయణతో కలసి కాకినాడ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి లోకేశ్, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ... ‘తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలి. ప్రజలు ఇళ్లల్లో లేని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే ప్రజలను అప్రమత్తం చేయాలి’ అని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ కొన్ని సూచనలు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడండి: లోకేశ్
‘తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. కాకినాడ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలి. కూటమి పార్టీల కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాలి. అంటురోగాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలి. అంబులెన్సులు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్తు సరఫరా, కమ్యూనికేషన్ సమస్యలు లేకుండా చూడాలి. తుఫాను బాధితులకు సాయం అవసరమైనా వెంటనే స్పందించేందుకు ప్రభుత్వం యంత్రాంగం 24/7 అందుబాటులో ఉంటుంది’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.