AP Govt Order Committee: జిల్లాలపై రేపు మంత్రుల కీలక భేటీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:27 AM
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల చేర్పులు, మార్పులపై రాష్ట్రప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఆహ్వానం
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల చేర్పులు, మార్పులపై రాష్ట్రప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తొలిసారి 13న ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో సమావేశం కానుంది. ఈమేరకు సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసేసింది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లడం కొన్ని చోట్ల ప్రయాసతో కూడుకున్నదిగా తయారయింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయి. మొత్తంగా జిల్లా, మండల, గ్రామాల పేర్లను, వాటి సరిహద్దులను మార్చాలంటూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మర్గాలను చూపేందుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, బీసీ జనార్దనరెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం (జీవోఎం) తొలి భేటీ నేపథ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు మార్పుపైన వారి వినతులను జీవోఎంకు సమర్పించవచ్చునని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.