Share News

Education Minister Lokesh: ఒక్క చాన్స్‌ తప్పు మీరు చేయొద్దు

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:39 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో బిహార్‌ పాత్ర చాలా కీలకమని.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువత ఎన్‌డీఏను మరోమారు గెలిపించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పిలుపిచ్చారు.....

Education Minister Lokesh: ఒక్క చాన్స్‌ తప్పు మీరు చేయొద్దు

  • ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మి మోసపోవద్దు

  • బిహార్‌ ఓటర్లకు లోకేశ్‌ పిలుపు

  • రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్‌డీఏ గెలవాలి

  • జంగిల్‌రాజ్‌ పోయి నితీశ్‌ వచ్చాకే అభివృద్ధి

  • డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ సర్కార్లతో ప్రయోజనాలెన్నో

  • బిహార్‌ గడ్డపై టీడీపీ యువనేత రెండ్రోజులు ప్రచారం

  • హిందీ ప్రసంగాలతో ఆకట్టుకున్న లోకేశ్‌

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో బిహార్‌ పాత్ర చాలా కీలకమని.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువత ఎన్‌డీఏను మరోమారు గెలిపించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పిలుపిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల.. శాంతిభద్రతలు క్షీణించి, పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. దానివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని బిహార్‌ యువతకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. బిహార్లో రెండో విడత ఎన్నికల్లో లోకేశ్‌ శని, ఆదివారాల్లో ప్రచారం నిర్వహించారు. శనివారం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో, బిహార్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తాను ఏపీ మంత్రిగా ఇక్కడకు రాలేదని, బాధ్యతాయుతమైన భారతీయుడిగా వచ్చానని చెప్పారు. ‘బిహార్లో జరగబోయే ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనవని తెలిపారు. ‘లీడర్‌షిప్‌ ట్రాక్‌ రికార్డు.. స్వచ్ఛమైన అవినీతిరహిత పాలన కోసం ఎన్‌డీఏని గెలిపించాలని కోరారు. ‘బిహార్‌, ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు లభిస్తున్నాయి. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం.. గుజరాత్‌, ఒడిసాల్లో ప్రభుత్వాల కొనసాగింపు వల్లే పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. ‘ఏపీలో మా సీఎం ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగినట్లుగానే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. బిహార్‌లో ఒక పార్టీ ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని ఈ హామీని నమ్మవద్దు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుది’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. కేంద్ర విద్యా మంత్రి, బిహార్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్‌తో లోకేశ్‌ పట్నాలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గతేడాది హరియాణా, ఒడిసాల్లో బీజేపీ విజయంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బిహార్‌లో ఎన్‌డీఏ గెలుపు కోసం ఆయన చేస్తున్న నిర్మాణాత్మక కృషిని లోకేశ్‌ అభినందించారు.


హిందీ ప్రసంగాలతో ఆకట్టుకుని..

ఎన్‌డీఏలో చేరిన తర్వాత రాష్ట్రం వెలుపల లోకేశ్‌ చేసిన తొలి ఎన్నికల ప్రచారమిది. తన ప్రచారంలో హిందీ, ఇంగ్లిషులో ప్రసంగించి వ్యాపారులను, ఎన్‌డీఏ నేతలు, శ్రేణులను ఆకట్టుకున్నారు. ప్రధానంగా ఏపీలో ఒక్క చాన్స్‌ పేరుతో 2019-24 నడుమ చేసిన తప్పిదాన్ని ప్రస్తావించారు. ఏపీ, బిహార్‌లో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ సర్కార్లు ఉండడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను విశదీకరించారు. ఉచితాలు.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీల్లోని డొల్లతనాన్ని చూపుతూ.. ఏపీలో తమ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ వస్తుందో వివరించారు. డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ సర్కారు నినాదం కూటమి ఐక్యతకు బలం చేకూర్చిందని స్థానిక నాయకులు ప్రశంసిస్తున్నారు. దక్షిణ దేశానికి చెందిన బలమైన యువనేతగా ఆయన బిహార్లో ప్రచారం చేయడం, ఎన్‌డీఏ పాన్‌ ఇండియా నినాదాన్ని నొక్కిచెప్పడం ఓటర్లను బాగా ఆకట్టుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. అక్కడి విపక్ష మహాగఠ్‌బంధన్‌ ఇస్తున్న హామీలకు భిన్నంగా లోకేశ్‌ చేసిన అభివృద్ధి ప్రచారం వ్యాపార వర్గాలతోపాటు అభివృద్ధినికి కోరుకునే ఓటర్లలో కొంత మార్పు తీసుకొస్తుందని ఎన్‌డీఏ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, లోకేశ్‌ బిహార్‌ ప్రచారానికి జాతీయ మీడియాలోనూ విస్తృత కవరేజీ లభించింది. జాతీయ రాజకీయాల్లో టీడీపీ మరింత చురుగ్గా, ఎన్‌డీఏలో కీలక భాగస్వామిగా తన ప్రాధాన్యాన్ని నిరూపించుకునే వ్యూహంలో భాగంగా ఆయన ప్రచారం ఉందని జాతీయ మీడియా అభివర్ణించింది. రెండో విడతలో బిహార్లోని 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగనుంది. మొదటి విడతలో 121 సీట్లకు ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 14వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 04:39 AM