AP IT and Education Minister Lokesh: ఏఐ విస్తరణకు సహకరించండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:21 AM
రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు సాధనే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు...
కేంద్ర మంత్రులకు మంత్రి లోకేశ్ వినతులు
న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు సాధనే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు. కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో లోకేశ్ భేటీ అయ్యారు. ఇండియా ఏఐ (కృత్రిమ మేధ) మిషన్ కింద రాష్ట్రంలో ఏఐని వేగంగా విస్తరింపజేసేందుకు మద్దతు అందించాలని అశ్వినీ వైష్టవ్‌కు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలన్నారు. ఏపీలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటుచేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)కు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (ఎంఈఐటీవై) స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఐహెచ్‌లో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్, వేవెక్స్ ఫ్రేమ్‌వర్క్ కింద ఐఎన్‌ఎన్‌ం ఎక్స్‌ఆర్ యానిమేషన్, ఏఆర్/వీఆర్, ఇమ్మెర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని లోకేశ్ కోరారు.
155 స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేయండి
ఏపీలో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందించాలని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో భేటీ సందర్భంగా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 11 జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) మంజూరుతో పాటు, రాష్ట్రంలో 12 కేవీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష సంస్కరణల్లో భాగంగా స్టార్స్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి రూ. 4,400 కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 1,270 కోట్ల అదనపు నిధుల మంజూరుకు ఆమోదం తెలపాలన్నారు. పీఎం పోషణ్ పథకం కింద పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలో 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతించాలన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో అభివృద్థి చేసిన మోడల్ ఆటిజం సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను లోకేశ్ ఆహ్వానించారు.
ఎన్‌ఎ్‌సటీఐకి 5 ఎకరాలు
విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్‌ఎ్‌సటీఐ) ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్య శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరికి రాష్ట్ర మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖ జిల్లా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మించి ఎస్‌బీటీఈటీ-ఏపీ ద్వారా ఎన్‌సీవీఈటీ అర్హతలను స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో మంత్రి లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎంపీలు సానా సతీశ్, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, పుట్టా మహేశ్, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శ్రీభరత్, వల్లభనేని బాలశౌరి తదితరులు ఉన్నారు.