Share News

Minister Lokesh: ఏపీలో ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ స్థాపించండి

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:18 AM

రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు.

Minister Lokesh: ఏపీలో ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ స్థాపించండి

  • క్వాంటం వ్యాలీలో హ్యాకథాన్‌ నిర్వహించండి

  • మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం

  • సింగపూర్‌లోని ఆ సంస్థ కార్యాలయం సందర్శన

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ కార్యాలయాన్ని లోకేశ్‌ బృందం బుధవారం సందర్శించింది. అక్కడ ఏఐ ఆధారిత గోస్టోర్‌లో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, తయారీ, వినియోగదారుల పరిశ్రమల వంటి రంగాల్లో ఏఐ వాడకాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రత్యేకతలను సంస్థ ప్రతినిధులు వివరించారు. రిటైల్‌, విద్య తదితర రంగాల్లో వ్యాపారులు, వినియోగదారులు, పరిశీలకులకు మద్దతును అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఐ ఆధారిత సేవల ద్వారా వినియోగదారులకు సేవలు ఆందిస్తున్నామన్నారు. కృత్రిమ మేధతో కూడిన వ్యాపార లావాదేవీలకు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ హెడ్‌ మార్కస్‌ లోహ్‌, సెలా హెడ్‌ జాస్మిన్‌ బేగం, సీఈవో మార్క్‌ సౌజాలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. జనరేటివ్‌ ఏఐ ఆధారిత పరిష్కారాలు కనుగొని సమన్వయం చేయడానికి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌/ టెక్నాలజీ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని వారిని మంత్రి ఆహ్వానించారు. భారతదేశంలో అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాల్లో ఏపీ ఒకటని తెలిపారు. క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌లో అజూర్‌ ఓపెన్‌ ఏఐ సేవలు, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ను ఉపయోగించి హ్యాకథాన్‌ నిర్వహించాలని కోరారు. ఇన్ఫినియన్‌ సెమీ కండక్టర్ల తయారీ యూ నిట్‌ను మంత్రి లోకేశ్‌ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ సీఎస్‌ దువాతో మంత్రి చర్చలు జరిపా రు. ఏపీలో ఈఎంసీలు, పారిశ్రామిక పార్కుల్లో సెమీ కండక్టర్ల తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్‌, టెస్టింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.


ఐవీపీ సెమీ ఫౌండర్‌ రాజా మాణిక్కంతో భేటీ

ఐవీపీ సెమీ ఫౌండర్‌ రాజా మాణిక్కంతో లోకేశ్‌ బృం దం భేటీ అయింది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్‌ లేదా చిప్‌ డిజైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రోత్సాహకాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, డీటీడీఎస్‌ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల త యారీకి ఎంఎస్ఎంఈలకు సహకరించాలని ఆసంస్థ సీఈ వో చక్రవర్తిని లోకేశ్‌ కోరారు. క్యాపిల్యాండ్‌ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సంజీవ్‌దాస్‌ గుప్తతోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకారించాలన్నారు. రాష్ట్రంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని ఏబీమ్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఎండీ యూనో టోమోకాజును కోరారు.

Updated Date - Jul 31 , 2025 | 05:19 AM