Nara Lokesh: ఆందోళన వద్దు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:07 AM
నేపాల్‌లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. నేపాల్‌లో రాష్ట్రానికి చెందినవారు భారీ సంఖ్యలో...
ఏపీ వాసులు అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం
నేపాల్‌లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేశ్ భరోసా
అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి
ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్‌లోనే
2 గంటలకోసారి వారందరి క్షేమ సమాచారం వాకబు
నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం
అమరావతి/మంగళగిరి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. నేపాల్‌లో రాష్ట్రానికి చెందినవారు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారన్న సమాచారంతో ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. అనంతపురంలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో పాల్గొనాల్సి ఉన్నా, సీఎం ఆదేశాలతో దాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్జీజీఎస్ సెంటర్‌లో ప్రత్యేక వార్‌రూం ఏర్పాటు చేసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేశ్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మి తో మంత్రి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్‌లో చిక్కుకున్న బాధితులను సంప్రదించి, వారి ఆహారం, భద్రత కు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. సుమారు 217 మంది ఏపీ వాసులు నేపాల్‌లో చిక్కుకున్నట్టు గుర్తించామని, వారిలో విజయనగరం, విశాఖపట్నంకు చెందిన 76 మంది, కర్నూలు నుంచి 22 మంది, మిగిలిన వారు ఇతర జిల్లాల వాసులని వివరించారు. వీరిలో 118 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వారందరినీ ప్రత్యేక విమానంలో విశాఖకు తీసుకువచ్చేలా చూడాలని సీఎస్ విజయానంద్‌ను లోకేశ్ కోరారు. గురువారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున, మధ్యాహ్నం నుంచి చిక్కుకుపోయిన వారిని తరలించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీలో 218 సీట్ల సామర్థ్యం ఉన్న ఇండిగో విమానాన్ని సిద్ధంగా ఉంచామని చెప్పారు.
లోకేశ్ వీడియో కాల్
కఠ్మాండూలోని రాయల్ కుసుమ్ హోటల్‌లో తలదాచుకున్న రోజారాణి, సూర్యప్రభ(విశాఖ), పశుపతి ఫ్రంట్ హోటల్‌లో చిక్కుకుపోయిన మాచర్ల హేమసుందరరావు, దామర్ల నాగలక్ష్మి(మంగళగిరి)తో లోకేశ్ వీడియో కాల్‌లో మాట్లాడారు. మంగళవారం తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు వాపోయారు. ఆందోళన చెందవద్దని, క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. ప్రతి రెండు గంటలకోసారి బాధితులతో అధికారులు మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అనంతపురం సభలో ఉన్న మంత్రులు అనిత, కందుల దుర్గేశ్ హుటాహుటిన అమరావతికి వచ్చి లోకేశ్‌తో పాటు సమీక్షలో పాల్గొన్నారు.
నేటి సాయంత్రానికి తెస్తాం: లోకేశ్
నేపాల్‌లోని కఠ్మాండూ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ వాసులను గురువారం సాయంత్రానికి విశాఖపట్నం, కడప తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. అక్కడినుంచి వారిని స్వస్థలాలకు క్షేమంగా తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడినట్లు తెలిపారు. బుధవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న ఏపీకి చెందిన వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అత్యవసరంగా ఒక విభాగం ఏర్పాటుచేసి బాధితులను సంప్రదించాం. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం గురువారం మధ్యాహ్నం కఠ్మాండూ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. అక్కడి నుంచి బయలుదేరి రెండున్నర గంటల్లో విశాఖ, తర్వాత 45 నిమిషాల్లో కడప విమానాశ్రయాలకు చేరుతుంది. ఎయిర్‌పోర్టు నుంచి వారందరినీ ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి రెండు గంటలకు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో తనకు చంద్రబాబు రోల్ మోడల్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, మూడు విమానాలు ఏర్పాటు చేసి, తెలుగు వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చారని లోకేశ్ గుర్తు చేశారు.
ఢిల్లీలో ప్రత్యేక విమానం సిద్ధం
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం, నేపాల్ అధికారుల సహకారంతో సమ గ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. నేపాల్‌లో మొత్తం 217 మంది ఏపీ వాసులు గుర్తించారు. 173 మంది కఠ్మాండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖారాలో, 12 మంది నేపాల్-చైనా సరిహద్దు సమీపంలోని సిమికోట్‌లో ఉన్నారు. వీరి తరలింపునకు ప్రత్యేకంగా ఇండిగో విమానం ఢిల్లీలో సిద్ధం గా ఉంది. ఈ విమానం నేడు కఠ్మాండూ వెళ్తుంది. నేపాల్ సైన్యం భద్రత నడుమ ప్రయాణికులను విమానాశ్రయానికి తరలిస్తారు. సిమికోట్‌లోని 12 మందిని తొలుత నేపాల్ విమానయాన సంస్థ ద్వారా నేపాల్‌గంజ్(యూపీ సరిహద్దు)కు చేరుస్తారు. హెటౌడాలోని 22 మంది రక్సౌల్(బిహార్ సరిహద్దు) వైపు రోడ్డు ప్రయాణం ప్రారంభించారు. వీరంతా బుధవారం రాత్రికే రక్సౌల్ చేరుకుంటారు.