AP DSC: మెగా డీఎస్సీ తుది మార్కులు విడుదల
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:17 AM
మెగా డీఎస్సీ-2025 పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డీఎస్సీ పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజీ మార్కులు...
టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం
సవరించుకునేందుకు 2 రోజుల సమయం
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డీఎస్సీ పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మార్కులను చూసుకోవచ్చని పేర్కొంది. టెట్ మార్కులపై ఎవరైనా అభ్యర్థులకు అభ్యంతరాలుంటే.. అక్కడే తమ వాస్తవ మార్కులను అప్‌డేట్ చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పించింది. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్‌తో మరోసారి పరిశీలించి, పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి.. దాని ఆధారంగా తుది మార్కులు మళ్లీ ఇస్తారు. టెట్ మార్కులను అప్‌డేట్ చేసుకునే రెండు రోజులు అవకాశం ఉంటుందని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఈ డీఎస్సీలో ఫైనల్ ‘కీ’లోనూ అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక ‘కీ’లో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది ‘కీ’లోనూ పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైనా అభ్యంతరాలు స్వీకరించి సవరించిన తుది ‘కీ’ విడుదల చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా, ఇవి మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు తెలిపారు.