Meat Development Corporation: చికెన్ దుకాణాల్లో కుళ్లిన మాంసం
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:18 AM
గుంటూరు నగరంలోని పలు చికెన్, మటన్ దుకాణాలు, కోళ్ల ఫారాలను ఏపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ నాయుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గుంటూరులోని పలు చోట్ల తనిఖీలు
నిల్వ చికెన్, చనిపోయిన కోళ్లు గుర్తింపు
గుంటూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలోని పలు చికెన్, మటన్ దుకాణాలు, కోళ్ల ఫారాలను ఏపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ నాయుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక పొన్నూరు రోడ్డు, లాంచెస్టరు రోడ్డు, మణిపురం ఫ్లైవోవర్ వద్ద ఉన్న దుకాణాలను తన బృం దంతో కలిసి పరిశీలించారు. కొన్నిచోట్ల నిల్వ ఉంచిన కోడి మాంసాన్ని నీళ్లల్లో నానబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచడాన్ని గమనించారు. అలానే చనిపోయిన కోళ్లను కూడా గుర్తించారు. చికెన్ షాపుల నిర్వహణకు పొందిన ప్రభుత్వ అనుమతి పత్రాలను పరిశీలించారు. ఒక చికెన్ స్టాల్‌కు రూ.5 వేలు, మరో దానికి రూ.2 వేల జరిమానా విధించారు. అలానే మరో ఫారంపై రూ.5 వేలు పెనాల్టీ వేశారు. చైర్మన్ ప్రకాశ్ నాయుడు మాట్లాడుతూ చికెన్, మటన్ దుకాణాలు, కోళ్ల ఫారాలు, కబేళాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.