Lorry Owners Association: ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించండి..
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:48 AM
పదమూడేళ్లకు పైబడిన వాహనాలకు భారీగా పెంచిన ఫిట్‌నెస్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని...
లేదంటే రేపు అర్ధరాత్రి నుంచి వాహనాలు నిలిపేస్తాం
ఏపీ లారీ యజమానుల సంఘం
విజయవాడ సిటీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : పదమూడేళ్లకు పైబడిన వాహనాలకు భారీగా పెంచిన ఫిట్‌నెస్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి లారీలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఉన్న ఏపీ లారీ యజమానుల సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1,340 ఉన్న ఫిట్‌నెస్ చార్జీని రూ.33,040కు పెంచుతూ గతనెల 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఓనర్ కమ్ డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న లారీ యజమానులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేస్తాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఇలాంటి ఉత్తర్వులను యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదని, గతంలో కేంద్రం ఇచ్చిన గ్రీన్‌ట్యాక్స్ ఉత్తర్వులను తమిళనాడు, కర్ణాటక అమలుచేయని విషయాన్ని ప్రస్తావించారు. ఫిట్‌నెస్ చార్జీల పెంపుతో 13 ఏళ్ల పైబడిన లారీ యజమానులపై భారం పడుతోందని, 20 ఏళ్లు పైబడిన లారీ యజమానులపై తీవ్రమైన భారం పడుతోందన్నారు. దీని కారణంగానే గతనెల 22 నుంచి రాష్ట్రంలో అనేక లారీలు నిలిచిపోయాయని.., విశాఖపట్నం, కాకినాడ, నిడదవోలు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి సరుకు రవాణా ఆగిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే కొన్నిరోజుల తరువాత రాష్ట్రంలోని అన్ని లారీలను నిలిపివేసి సరుకు రవాణాను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.