Jagan Liquor Scam: జే బ్రాండ్లకు గేట్లెత్తారు
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:55 AM
ఒక మద్యం బ్రాండ్‌కు అనుమతి రావాలంటే నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు అది సంవత్సరాలు కూడా అవుతుంది. కానీ జగన్ జమానాలో కొత్త బ్రాండ్లకు అలా అడిగిన వెంటనే ఇలా అనుమతులు వచ్చేశాయి.
అనుమతి పొందిన వెంటనే లక్షల కేసుల ఆర్డర్లు
10 వేల కేసులు దాటకూడదన్న నిబంధనకు స్వస్తి
ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా అనుమతి
చివరికి చిరునామాలు ఇవ్వకపోయినా ఓకే
పాపులర్ బ్రాండ్లకు ఆర్డర్లలో మొండిచేయి
గత ప్రభుత్వాల్లో లక్షల్లో అమ్ముడైన బ్రాండ్లవి
జగన్ జమానాలో పది కేసులూ ఇవ్వని వైనం
మద్యం స్కామ్ చార్జిషీట్‌లో సిట్ వెల్లడి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒక మద్యం బ్రాండ్‌కు అనుమతి రావాలంటే నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు అది సంవత్సరాలు కూడా అవుతుంది. కానీ జగన్ జమానాలో కొత్త బ్రాండ్లకు అలా అడిగిన వెంటనే ఇలా అనుమతులు వచ్చేశాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆరు నెలల్లోనే ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్ విస్కీకి అనుమతి లభించింది. ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలో మరో 18 బ్రాండ్లకు అనుమతులు వచ్చేశాయి. అయితే అనుమతులు రావడం ఒకెత్తు అయితే అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కొత్తగా వచ్చిన బ్రాండ్లకు నెలకు గరిష్ఠంగా 10వేల కేసులు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలి. ఈ నిబంధనను తుంగలో తొక్కిన గత జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లకు మొదటి నెలలోనే లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చేసింది. అప్పటికే మార్కెట్‌లో ఉన్న పాపులర్ బ్రాండ్లను పక్కనపెట్టి ఇలాంటి జే బ్రాండ్లకు పెద్దపీట వేసింది. ఆ బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం షాపులకు తరలించి బలవంతంగా అమ్మించింది. ఫలితంగా పాపులర్ బ్రాండ్లు కనుమరుగై, వాటి స్థానంలో ఊరుపేరు లేని జే బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మారు. అనుమతిపొందిన వెంటనే లక్షల్లో ఆర్డర్లు ఇచ్చిన విషయాన్ని మద్యం కుంభకోణంపై చార్జిషీట్‌లో దర్యాప్తు ప్రత్యేక బృందం (సిట్) వెల్లడించింది.
పాపులర్ అయితే మాకేంటి?
ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్ విస్కీ బ్రాండ్‌కు 2019 నవంబరు 22న అనుమతి లభించింది. ఆ వెంటనే డిసెంబరు నెలలో ఏకంగా 1,51,600 కేసుల ఆర్డర్లు ఆ ఒక్క బ్రాండ్‌కే వెళ్లాయి. అదాన్ కంపెనీకి చెందిన అదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్‌కు 2020 మే 21న అనుమతి లభించింది. జూలైలో 1,03,400 కేసుల ఆర్డర్లు ఆ బ్రాండ్‌కు ఇచ్చారు. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్‌కు 2021 మార్చి 7న అనుమతి వచ్చింది. అదే ఏడాది జూన్‌లో 69,300 కేసుల ఆర్డర్లు ఆ బ్రాండ్‌కు దక్కాయి. ఎస్పీవై సెలబ్రిటీ బ్రాందీకి 2020 జూన్ 19న అనుమతి వస్తే, అక్టోబరులో 35,100 కేసుల ఆర్డర్లు వెళ్లాయి. ఇవన్నీ ఆ బ్రాండ్లకు మొదటి నెల అమ్మకాలకు ఇచ్చిన ఆర్డర్లు. అలాగే గోల్డెన్ రిజర్వ్ ప్రిస్టేజ్ విస్కీకి 30వేలు, కింగ్స్‌వెల్ సెలెక్ట్ బ్రాందీకి 30వేలు, బీడీహెచ్ గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీకి 22,500, గోల్డెన్ కింగ్ డీలక్స్ ఓల్డ్ ఫైన్ విస్కీకి 22,450, సిల్వర్ స్ర్టిప్స్ ఒరిజినల్ రిజర్వ్ విస్కీకి 21,060, ఎస్పీవై గెలాక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీకి 17,500, ఎస్‌ఎన్‌జె డాక్టర్ బ్రాందీకి 17,150, ఎస్పీవై గెలాక్సీ బ్రాందీకి 33,100 కేసులు మొదటి నెలలోనే ఆర్డర్ ఇచ్చినట్లు చార్జిషీట్‌లో సిట్ తెలిపింది.
లోపాలున్నా ఇచ్చేశారు
మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చేటప్పుడు వాటిని సరఫరా చేసే కంపెనీలు అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఒక్కటి లేకపోయినా అనుమతి ఇవ్వరు. కానీ సొంత బ్రాండ్లను తీసుకొచ్చే క్రమంలో వైసీపీ ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. అనేక పత్రాలు సమర్పించకపోయినా ఎడాపెడా అనుమతులు జారీచేసింది.
ఎస్పీవై కంపెనీ ఫొటోలు, చిరునామా పత్రాలు, ఈ-ఆఫర్ టెండర్ నోటిఫికేషన్, వార్షిక నివేదికలు, మద్యం అసోసియేషన్‌తో ఒప్పంద పత్రం, ఆర్‌టీజీఎస్ బ్యాంకు ఖాతా వివరాలు, ప్రాంచైజీ కాపీ, ఆథరైజేషన్ లెటర్ ఇవ్వలేదు. అయినా అనుమతులు ఇచ్చేశారు. అదాన్ కంపెనీ, జీఎ్‌సబీ అండ్ కో ఎల్‌ఎల్‌పీ, ఈగల్ డిస్టిలరీ, ఓమ్ సన్స్ మార్కెటింగ్, పెరల్ డిస్టిలరీ, లీలాస్ డిస్టిలరీ, ఎన్‌వీ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్, సన్‌రేస్ బాటిలింగ్, బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ కంపెనీల్లో ఉత్పత్తి చేసిన బ్రాండ్లకు అనేక పత్రాలు సమర్పించకపోయినా అప్పనంగా అనుమతులు మంజూరుచేశారని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
ప్రీమియం బ్రాండ్లను తొక్కేశారు
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కంపెనీలతో గత జగన్ ప్రభుత్వం కమీషన్ల బేరాలు మొదలుపెట్టింది. ఇందుకు అంగీకరించని పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసింది. కింగ్‌ఫిషర్ బీర్ ఉత్పత్తి చేసే రణస్థలంలోని బ్రూవరీ అప్పట్లో కంపెనీనే మూసేసింది. దీనివల్ల తమ ఉపాధి పోయిందని స్థానికులు రోడ్డెక్కారు. ఆ బ్రాండ్ అప్పటికే సరఫరా చేసిన వేల కేసుల బీరును షాపులకు పంపకుండా మద్యం డిపోల్లోనే ఉంచారు. చివరికి పాడైపోయిందనే కారణంతో రోడ్ రోలర్‌తో ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేయించింది. అయితే కొంతకాలం తర్వాత అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకుని మళ్లీ కింగ్‌ఫిషర్‌కు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..
విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి
For More Andhra Pradesh News