Share News

DGP Harish Kumar Gupta: ఐసీజేఎస్‌తో వేగంగా న్యాయ విచారణ

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:18 AM

న్యాయ స్థానాలు, దర్యాప్తు సంస్థల మధ్య డేటా బదిలీ వల్ల న్యాయ విచారణ త్వరితగతిన పూర్తి అవుతుందని, సామాన్య బాధితుడికి సకాలంలో న్యాయం జరుగుతుందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అన్నారు.

DGP Harish Kumar Gupta: ఐసీజేఎస్‌తో వేగంగా న్యాయ విచారణ

  • సామాన్య బాధితుడికి సకాలంలో న్యాయం

  • కోర్టులు, పోలీసు, ఫోరెన్సిక్‌, జైళ్ల శాఖలకు 4,575 కంప్యూటర్లు: డీజీపీ హరీశ్‌ గుప్తా

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): న్యాయ స్థానాలు, దర్యాప్తు సంస్థల మధ్య డేటా బదిలీ వల్ల న్యాయ విచారణ త్వరితగతిన పూర్తి అవుతుందని, సామాన్య బాధితుడికి సకాలంలో న్యాయం జరుగుతుందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అన్నారు. శనివారం కేంద్ర హోంశాఖ సహకారంతో ఇంటర్‌-ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌(ఐసీజేఎ్‌స)ను ఏపీలో అధికారికంగా డీజీపీ ప్రారంభించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో టెక్నికల్‌ విభాగం ఐజీ శ్రీకాంత్‌తో కలిసి డీజీపీ ఈ సందర్భంగా మాట్లాడారు. ఐసీజేఎస్‌ అమల్లోకి రావడం కేసుల్లో శిక్షలు పడటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేరాలు చేసిన వ్యక్తులు ఏదో ఒక రూపంలో తప్పించుకోవడానికి అడ్డంకులు సృష్టిస్తుంటారని, ఇకనుంచి ప్రతి పేపర్‌, ఆధారం అన్నీ డిజిటల్‌ రూపంలో కోర్టు, పోలీసు, ఫోరెన్సిక్‌, జైలు అధికారుల కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటాయని చెప్పారు. న్యాయ, పోలీసు, ఫోరెన్సిక్‌, జైళ్ల శాఖల అనుసంధానంతో రియల్‌ టైమ్‌ డేటా బదిలీ జరుగుతుందని, సంబంధిత అధికారుల్లో పారదర్శకత కూడా పెరుగుతుందని అన్నారు. డిజిటల్‌ వేదిక ద్వారా కాగిత రహిత సాంకేతిక ఆధారిత న్యాయవ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.88.03 కోట్లు ఖర్చు చేసి 4,575 కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్‌ స్కానర్లు, క్యూఆర్‌ కోడ్‌ రీడర్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌, కోర్టు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, జైలు, ప్రాసిక్యూషన్‌ ఆఫీసుల్లో ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌, సాక్ష్యాల రికార్డింగ్‌, రియల్‌ టైమ్‌ క్రైమ్‌ సీన్‌ డాక్యుమెంటేషన్‌, నిందితుల వేలిముద్రల ప్రాసెసింగ్‌ లాంటి సదుపాయలు ఉన్నట్లు వివరించారు.

Updated Date - Aug 03 , 2025 | 04:18 AM