APSRTC: ఉచిత ప్రయాణానికి ఇది తప్పనిసరి
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:16 AM
ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం తలపెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు
ఏపీ మహిళలకు మాత్రమే పథకం వర్తింపు: ఆర్టీసీ ఎండీ
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రోల్లో అనుమతి
ఆర్టీసీ ఎండీ తిరుమలరావు, చైర్మన్ కొనకళ్ల
గుంటూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం తలపెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై జోన్ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల పరిధిలోని అధికారులతో గుంటూరులో బుధవారం ఎండీ తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ సురేశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఏపీకి చెందిన వారేనని ఆధార్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా బస్సులో చూపాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాం. త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి ఏటా డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. అలానే గురువారం విజయవాడలో తరువాత వైజాగ్‌లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తాం’ అని ఎండీ తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ... ‘కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించే అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి. ఉచిత బస్సుతో మహిళల జీవితంలో పెనుమార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బందితోనే ఉచిత బస్సు పథకం అమలు చేస్తాం. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది’ అని తెలిపారు.