AP Launches Driver cum Guide Service: రాష్ట్రంలో డ్రైవర్ కం గైడ్
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:38 AM
ఏపీకి వచ్చే పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి దుర్గేశ్ తెలిపారు...
దేశంలోనే తొలిసారిగా అమలు
రాపిడోతో పర్యాటక శాఖ ఒప్పందం: మంత్రి దుర్గేశ్
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఏపీకి వచ్చే పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి దుర్గేశ్ తెలిపారు. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కం గైడ్’ విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరిస్తోందన్నారు. ‘సీఎం చంద్రబాబు సమక్షంలో రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లితో విశాఖలోని సీఐఐ సదస్సులో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒప్పందం మేరకు రాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేస్తాం. వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, అతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలను ప్రారంభిస్తాం. రాపిడో యాప్‌లోనే టూరిస్టు ఆటోలు, క్యాబ్, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక కో - బ్రాండెడ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేసి పర్యాటక సేవలను సులభతరం చేస్తాం. ఈ ప్రాజెక్టు... పర్యాటక రవాణాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు.