Land Management Authority: కడపలో సోలార్ కార్పొరేషన్‌కు
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:24 AM
రాష్ట్రంలో పలు కంపెనీలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ (ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ఏపీఎల్‌ఎమ్‌ఏ) ఆమోదం తెలిపింది.
నంద్యాల జిల్లాలో గ్రీన్‌కోకు 174 ఎకరాలు
అన్నమయ్య జిల్లాలో టిడ్కోకు 50 ఎకరాలు
కుప్పంలో కేంద్రీయ విద్యాలయానికి ఏడెకరాలు
ఆగిరిపల్లిలో నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు 45 ఎకరాలు
ఆమోదించిన ఏపీఎల్‌ఎమ్‌ఏ
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు కంపెనీలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ (ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ఏపీఎల్‌ఎమ్‌ఏ) ఆమోదం తెలిపింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో అథారిటీ సమావేశం జరిగింది. అదనపు సీసీఎల్‌ఏ, కన్వీనర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డి, ఆర్థిక, పురపాలక, ఇంధన, గృహనిర్మాణ, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలకమైన ఎనిమిది అంశాల ఎజెండాపై చర్చించారు. రాష్ట్ర సోలార్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కడప జిల్లా మైలవరం మండలం దోడియం, వడ్డీరాల గ్రామాల్లో 1,200 ఎకరాలను లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించారు. గ్రీన్‌కో కంపెనీకి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో 174.1 ఎకరాల కేటాయింపునకు ఎల్‌ఎమ్‌ఏ ఆమోదం తెలిపింది. గతంలో నిర్ణయించిన ధర మేరకు ఎకరా రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని తీర్మానించినట్లు తెలిసింది. కడప జిల్లా కొండాపురం మండలం కొప్పోలు, కోడూరు, చామలూరు గ్రామాల్లో 45 ఎకరాలు హెటిరో విండ్‌పవర్‌కు.. తొండూరు మండలం మల్లేల, ఉడవగండ్ల గ్రామాల్లో 40 ఎకరాలు అట్రియా విండ్‌పవర్‌కు కేటాయించేందుకు సమ్మతించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరాగునిపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7.74 ఎకరాలు కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబయల గ్రామంలో ఏపీ టిడ్కోకు 50 ఎకరాలు కేటాయింపునకు అంగీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ కింద గృహనిర్మాణం కోసం ఈ భూములు కేటాయించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 45.60 ఎకరాల కేటాయింపునకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎకరాకు రూ.37 లక్షల ధర వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించినట్లు తెలిసింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు.