AP Judicial Academy: గృహహింస కేసులలో మధ్యవర్తిత్వంపై వర్క్‌షాప్
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:46 AM
రాష్ట్రంలో గృహహింస కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై శనివారం ఏపీ జ్యుడీషియల్ అకాడమీ...
ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ
న్యాయాధికారులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, హైకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ దిశానిర్దేశం
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహహింస కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై శనివారం ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో న్యాయాధికారులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, కాజాలోని జ్యుడీషియల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ హాజరై న్యాయాధికారులకు దిశానిర్దేశం చేశారు. గృహహింస కేసులను వేగంగా పరిష్కరించేందుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. వీరితోపాటు జ్యుడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వీరితో పాటు అన్ని జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీల చైర్మన్‌లు(జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు), ఫ్యామిలీ కోర్టు ప్రిసైడింగ్ అధికారులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు, వాణిజ్య కోర్టులకు అధ్యక్షతవహించే న్యాయాధికారులు, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి, ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిప్యూటీ సెక్రెటరీ, అన్ని జిల్లాల ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శులు, మేజిస్ట్రేట్‌లు పాల్గొన్నారు.