Share News

AP JAC: బకాయిలపై మూడు నెలల్లోగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:07 AM

మధ్యంతర భృతి, డీఏ తదితర బకాయిలపై ప్రభుత్వం మూడు నెలల్లోగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

AP JAC: బకాయిలపై మూడు నెలల్లోగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలి

  • లేకపోతే మరో ఉద్యమానికి సిద్ధం

  • గత ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీతో ఇబ్బందులు

  • ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు

విజయవాడ (గాంధీనగర్‌), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మధ్యంతర భృతి, డీఏ తదితర బకాయిలపై ప్రభుత్వం మూడు నెలల్లోగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. లేదంటే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈనెల 20న ప్రభుత్వం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు చర్చకు రాకపోవడం నిరాశకు గురి చేసిందన్నారు. జేఏసీ అనుబంధ సంఘాలతో రాష్ట్రస్థాయి జనరల్‌ బాడీ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శనివారం జరిగింది. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. గతంలో 92 రోజుల పాటు ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని నిలదీసిన చరిత్ర తమ జేఏసీకి ఉందన్నారు. గత ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బకాయిలపై తమతో చర్చించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక్కో ఉద్యోగికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. పేస్లి్‌పలో బకాయిల వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే బకాయిల రూపంలో ఒక్కో ఉద్యోగి రూ.5 వేలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రిటైర్‌ అయిన వెంటనే బెనిఫిట్స్‌ అందజేసి గౌరవంగా సాగనంపే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మీడియా సమావేశంలో జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ పి.దామోదరరావు, అసోసియేట్‌ చైర్మన్‌ ఫణి పేర్రాజు, నేతలు ఎస్‌.శ్రీనివాసరావు, జనకుల శ్రీనివాసరావు, పీఎస్ఎస్ఎస్ శాస్త్రి, పి.లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 06:08 AM