Share News

AP JAC: సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ

ABN , Publish Date - Sep 26 , 2025 | 04:41 AM

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అక్టోబరు చివరి వారంలో రాష్ట్రస్థాయిలో విస్తృత సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని...

AP JAC: సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ

  • గుంటూరులో యూటీఎఫ్‌ రణభేరిలో ఏపీ జేఏసీ ప్రకటన

గుంటూరు (విద్య), సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అక్టోబరు చివరి వారంలో రాష్ట్రస్థాయిలో విస్తృత సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌ వెల్లడించారు. గురువారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రణభేరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం అర్ధించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఏపీజీఎల్‌ఐ సొమ్ము రూ.15 వేల కోట్లు ఉందని, మరోవైపు వాటిని పూర్తిస్థాయిలో మంజూరు చేయకుండా ఏడాదికి రూ.450 కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబరు 10వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని 10 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చలో ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. అనంతరం మండల, తాలూకా, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం అక్టోబరు 27 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయిలో రిలే దీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Updated Date - Sep 26 , 2025 | 04:42 AM