AP Intermediate Education: ఎంపీసీలో చరిత్ర.. బైపీసీలో జాగ్రఫీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:42 AM
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు.
సరికొత్తగా మారిన ఇంటర్ విద్య
ఎలక్టివ్ విధానం తెచ్చిన వైవిధ్యమిది
24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు
ఎంపీసీలో ‘ఫ్రెంచ్’ తీసుకున్న కొందరు
సీఈసీలో బయాలజీ తీసుకున్న 15 మంది
ఎం బైపీసీ విద్యార్థులు 11,257 మంది నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్టుల ఎంపిక
ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక
లెక్కలతో కుస్తీపట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు, మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్, జాగ్రఫీ తీసుకున్నారు. అకౌంట్లు సరిచూసే సీఈసీ విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచి భాషను ఓ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. కొందరు సీఈసీ విద్యార్థులైతే పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో తీసుకొచ్చిన కీలకమార్పులతో విద్యార్థులకు ఈ అవకాశం లభించింది
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకూ ఇంటర్మీడియట్ విద్య అంటే సంబంధిత సబ్జెక్టులే చదవాలి అనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ కాకుండా మరో సబ్జెక్టు చదివే అవకాశం ఉండేది కాదు. అలాగే బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీలు మాత్రమే చదవాలి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకొచ్చిన మార్పులతో కోర్ సబ్జెక్టులను ఎలాగైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. దీంతో విద్యార్థులు వైవిధ్యమైన కాంబినేషన్‌లో సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు.
వచ్చిన మార్పు ఇదీ...
ఇంటర్ బోర్డు కోర్సులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకూ ఎంపీసీ, బైపీసీల్లో ఆరేసి సబ్జెక్టులు, మిగిలినగ్రూపుల్లో ఐదు చొప్పున సబ్జెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ఎంపీసీలో ఎ,బిలుగా ఉన్న గణితం సబ్జెక్టులను ఒక్కటిగా కలిపింది. బైపీసీలో ఉన్న బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చింది. దీంతో అన్ని గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమల్లోకి వచ్చింది. అలాగే భాషా సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టు. రెండో భాష సబ్జెక్టు ఉండేది. అంటే విద్యార్థి ఆ స్థానంలో ఏదైనా భాష సబ్జెక్టు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అందువల్ల చాలా మంది విద్యార్థులు సంస్కృతం తీసుకునేవారు. ఇకనుంచి ద్వితీయ భాష సబ్జెక్టు స్థానంలో ఎలక్టివ్ సబ్జెక్టును తీసుకొచ్చింది. అంటే మొత్తం ఇంటర్ విద్యలో అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టులను ఎలక్టివ్ సబ్జెక్టు కింద తీసుకోవచ్చు. అయితే, ఎంపికలో ఎలాంటి పరిమితులు లేవు. దీంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకుంటే, బైపీసీ విద్యార్థులు గణితం తీసుకున్నారు.
ఎంబైపీసీలో 11,257 మంది
ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పులతో విద్యార్థులకు ఎంబైపీసీ చదివే అవకాశం వచ్చింది. సాంకేతికంగా ఎంబైపీసీ పేరుతో గ్రూపు లేకపోయినా ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు గణితం చదివే వెసులుబాటు కలిగింది. దీంతో 133 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, 111 మంది బైపీసీ విద్యార్థులు గణితం ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకున్నారు. అయితే ఎంబైపీసీ కోసం ఇంటర్ బోర్డు మరో అవకాశం కూడా కల్పించింది. ఈ రెండు గ్రూపుల విద్యార్థులకు అదనపు సబ్జెక్టు తీసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకున్నారు. అయితే ఈ అదనపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ ఇవే సబ్జెక్టులను ఎలక్టివ్‌గా తీసుకున్నవారు మాత్రం కచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. అదనపు సబ్జెక్టు తీసుకున్న వారికి మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా ఎలక్టివ్ లేక అదనపు పద్ధతిలో 11,,257 మంది ఎంబైపీసీ చదువుతున్నారు. వీరు ఇంటర్మీడియట్ అనంతరం అటు ఇంజనీరింగ్ వైపు లేదా మెడిసిన్ వైపు వెళ్లొచ్చు. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 5,40,924 మంది అడ్మిషన్ పొందారు.
ఇలా ఎంపిక చేసుకున్నారు...
133 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీ సబ్జెక్టు తీసుకున్నారు. ఒకరు సివిక్స్, ఆరుగురు కామర్స్, ఒకరు ఎకనామిక్స్, 54 మంది ఫ్రెంచ్, 21 మంది జాగ్రఫీ, 3,989 మంది హిందీ, ముగ్గురు చరిత్ర, 12 మంది కన్నడ, 243 మంది ఒరియా, 37 మంది పర్షియన్, 2.41లక్షల మంది సంస్కృతం, 213 మంది తమిళం, 1,787 మంది ఉర్దూ, 830 మంది అరబిక్ తీసుకున్నారు.
బైపీసీ విద్యార్థుల్లో... 515 మంది అరబిక్, ఇద్దరు సివిక్స్, ఎనిమిది మంది ఫ్రెంచ్, 29 మంది జాగ్రఫీ, 3,239 మంది హిందీ, ఇద్దరు చరిత్ర, 111 మంది గణితం, 265 మంది ఒరియా, 13 మంది పర్షియన్, 48,692 మంది సంస్కృతం, 82 మంది తమిళం, 1,308 మంది ఉర్దూ తీసుకున్నారు.
సీఈసీ గ్రూపు విద్యార్థుల్లో 27 మంది అరబిక్, 15 మంది బయాలజీ, 63 మంది చరిత్ర, ఎనిమిది మంది గణితం, 11 మంది పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ ఎంపిక చేసుకున్నారు. ఎంఈసీ గ్రూపు విద్యార్థుల్లో ఐదుగురు ఫ్రెం చ్, 13 మంది జాగ్రఫీ ఎంచుకున్నారు. హెచ్‌ఈసీలో ఓ విద్యార్థి బయాలజీ, ముగ్గురు గణితం తీసుకున్నారు.
ఒకరోజు ఒక సబ్జెక్టే
ఎంబైపీసీ, ఎలక్టివ్ విధానం ప్రవేశపెట్టడంతో పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్చనుంది. ప్రతి సంవత్సరం గణితం సబ్జెక్టు ఉన్నరోజే బోటనీ, జువాలజీ పరీక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎంబైపీసీ తీసుకున్నవారు రెండూ ఒకేరోజు రాయడం సాధ్యం కాదు కాబట్టి వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ విద్యార్థులకు ఒక రోజు ఒకే సబ్జెక్టు పరీక్ష ఉండేలా మార్పులు చేయనున్నారు. దీనివల్ల పరీక్షలకు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి మార్చికి బదులుగా ఫిబ్రవరి నుంచే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది.