AP Industrial Boom: స్పీడు పెరిగింది
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:37 AM
పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ జోరుగా ముందుకెళుతోందని జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) చైర్మన్ రజత్ కుమార్ సైనీ చెప్పారు.
పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు.. మోదీ వేగానికి చంద్రబాబు తోడు
‘మేకిన్ ఇండియా’లో ఏపీ కీలకం.. ఉత్పత్తి కేంద్రాలుగా
3 పారిశ్రామిక కారిడార్లు.. పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం
కర్నూలులో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ
కొప్పర్తితో మారనున్న సీమ ముఖచిత్రం
జగన్ ప్రభుత్వంలో కాలయాపనతోనే సరి
కృష్ణపట్నం టెండర్లకే మూడేళ్లు పట్టింది
కూటమి వచ్చాక విధాన నిర్ణయాల్లో వేగం
(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)
పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ జోరుగా ముందుకెళుతోందని జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) చైర్మన్ రజత్ కుమార్ సైనీ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ స్వప్నం సాకారంలో ఏపీ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సత్వర చర్యల వల్ల కృష్ణపట్నం, ఓర్వక ల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు వచ్చే మూడేళ్లలోపే పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాలుగా మారుతాయని అన్నారు. పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’తో రజత్ కుమార్ సైనీ మాట్లాడారు. భూసేకరణలో సమస్యల్ని పరిష్కరించి స్థానికులకు నష్టపరిహారం చెల్లించడం, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీరు కేటాయించడంతో పాటు ఇతర మౌలిక వనరులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలు తీసుకున్నందువల్లే ఈ మూడు పారిశ్రామిక కారిడార్లు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రజత్ కుమార్ సైనీ ఇంకా ఏమన్నారంటే..
గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు
జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ కారిడార్లపై దృష్టి సారించలేదు. టెండర్లకే మూడు సంవత్సరాలు పట్టింది. 2020లో కృష్ణపట్నం ప్రాజెక్టు చేపడితే 2023లో టెండర్లు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఆగస్టులో ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే 2025 జూలై లోపే టెండర్లు కేటాయించారు. ప్రభుత్వం మారడం వల్ల విధాన నిర్ణయాలు వేగంగా అమలయ్యాయి. గుజరాత్‌లోని ధొలేరాలో సెమీకండక్టర్ పరిశ్రమ ఉంది. ఏపీకి కూడా సెమీ కండక్టర్ పరిశ్రమ వచ్చే అవకాశం ఉంది. విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీలో పారిశ్రామిక కారిడార్లపై పారిశ్రామిక వేత్తల దృష్టి తప్పక మళ్లుతుంది.
డ్రోన్ రాజధానిగా ఏపీ
కర్నూలులోని ఓర్వకల్లులో నవంబరులో పనులు ప్రారంభమవుతాయి. ఇక్కడ డ్రోన్ సిటీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పెద్దది. భారతదేశానికి డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. స్వదేశీ టెక్నాలజీతో అత్యాధునిక డ్రోన్‌లను ఇక్కడ తయారు చేస్తారు. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద 2621 ఎకరాల్లో అభివృద్ది చెందుతున్న ఓర్వకల్లు నోడ్ ఇతర రెండు పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేస్తుంది. కృష్ణపట్నం రేవుకు ఈ కారిడార్ ముఖ ద్వారంగా ఉంటుంది. హైదరాబాద్, కడప విమానాశ్రయాలు దగ్గర్లోనే ఉంటాయి. కృష్ణపట్నంలో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు 30 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే మూడు నెలల్లో రహదారులతో సహా అన్ని సౌకర్యాలతో 500 ఎకరాలు సిద్ధం చేసి పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తాం. నాయుడుపేట గ్రీన్ ఫీల్డ్ రహదారి అక్కడకు సమీపంలోనే ఉంటుంది. అలాగే చెన్నై విమానాశ్రయం 300 కి.మీ దూరంలో ఉంటుంది. శ్రీసిటీ, గ్రీన్ ఫీల్డ్ రహదారి, కృష్ణపట్నంతో అనేక అవకాశాలు వస్తాయి. ఇప్పటికే అక్కడ పెద్ద ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. చాలా ప్రైవేట్ సంస్థలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిపెట్టుకున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ‘క్రిస్’ సిటీ 10,800 ఎకరాల్లో మూడు దశలుగా అభివృద్ది చెందుతోంది. అదొక అభివృద్ధి కూడలిగా మారుతుంది. కృష్ణపట్నం ఓడరేవు వాణిజ్య కూడలిగా మారనుంది. పరిశ్రమలకు ఈ ప్రాంతం అత్యంత అనువైనదిగా మారనుంది. వైజాగ్-చెన్నై కారిడార్‌లో భాగంగా 2,595 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం కడప విమానాశ్రయానికి సమీపంలోనే ఉంటుంది. తిరుపతి, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం వల్ల ఈ పారిశ్రామిక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక అభివృద్ధితో రాయలసీమ ముఖచిత్రం మారుతుంది.
ఉత్పాదక కేంద్రంగా దేశం
పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున భూమి, సబ్సిడీ, సదుపాయాలు కల్పించడం కొత్త కాదు. ప్రపంచం అంతటా ఇదే సూత్రం అమలవుతుంది. ఒక భారీ పరిశ్రమ వస్తే దాని ప్రభావం అన్ని రంగాలపైనా, ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. భారత దేశం సర్వీసు, మార్కెట్ కే పరిమితం కాకుండా ఉత్పాదక కేంద్రంగా మారడమే మన లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తల దృష్టి భారత్‌పై పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో పారిశ్రామిక వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయు!