Share News

Vishakhapatnam: ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెటింగ్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:23 AM

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలను కల్పించడంతోపాటు ఏపీని ఎగుమతుల...

Vishakhapatnam: ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెటింగ్‌

  • ఎగుమతుల కేంద్రంగా ఆంధ్ర

  • విశాఖలో రేపు, ఎల్లుండి రివర్స్‌ బయ్యర్‌-సెల్లర్‌ మీట్‌

  • 34 దేశాల నుంచి పలు కంపెనీల ప్రతినిధులు రాక

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలను కల్పించడంతోపాటు ఏపీని ఎగుమతుల కేంద్రంగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ దేశాల కొనుగోలుదారుల ముందు ప్రదర్శించి, ఎగుమతుల సామర్థ్యాన్ని సుస్థిరం చేసుకుని, అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కీలక రంగాల్లోని ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలను అన్వేషించడానికి, ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కొనుగోలుదారులను రాష్ట్రానికి రప్పించి, మన పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ‘ఎంఎస్ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ కన్వెన్షన్‌-2025’ పేరుతో రివర్స్‌ బయ్యర్‌-సెల్లర్‌ మీట్‌ (ఆర్బీఎస్ఎం)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ‘ర్యాంప్‌’ పథకం కింద ఆంధప్రదేశ్‌ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సును విశాఖపట్నలోని ఒక ప్రైవేట్‌ హోటల్లో ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక, జింబాబ్వే, ఉగాండా, కోస్టారికా, రష్యా, టాంజానియా, నేపాల్‌, ఈజిప్టు, జపాన్‌, ఘనా, న్యూజిల్యాండ్‌, హంగేరి, కెన్యా, టోగో.. ఇలా 34 దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి వివిధ రంగాల్లోని ఉత్పత్తులను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.


ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదై, రాష్ట్రం నుంచి ఎగుమతులకు సిద్ధమైన ఎంఎస్ఎంఈలు ఈ సదస్సులో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు. ఈ సదస్సులో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య పరస్పర చర్చలు, క్యూరేటెడ్‌ బీ2బీ సమావేశాలు, ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను సులభతరం చేయడానికి ఆయా రంగాల వారీగా కేంద్రీకృత నెట్‌వర్కింగ్‌ సెషన్లు ఉంటాయని ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు ముందు నిర్వహిస్తున్న ఈ ‘రివర్స్‌ బయ్యర్‌-సెల్లర్‌ మీట్‌’ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 06:24 AM