Students Struggle for Certificates: కొండలా ఫీజు బకాయిలు!
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:36 AM
ఉన్నత విద్యాశాఖలో ఫీజుల బకాయిలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు రూ.2 వేల కోట్లకు పైగా ఉన్న బకాయిలు...
ఆరు క్వార్టర్ల ఫీజుల చెల్లింపు పెండింగ్
వైసీపీ హయాంలో 3... ఇప్పుడు మూడు
4,200 కోట్ల మేర పేరుకుపోయిన వైనం
సర్టిఫికెట్ల జారీలో విద్యార్థులకు తిప్పలు
ఫీజులు కడితేనే ఇస్తామంటున్న కాలేజీలు
వర్సిటీలూ అంతే.. పట్టించుకోని ఉన్నతాధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్యాశాఖలో ఫీజుల బకాయిలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు రూ.2 వేల కోట్లకు పైగా ఉన్న బకాయిలు.. ఇప్పుడు రూ.4 వేల కోట్లు దాటాయి. గత వైసీపీ సర్కార్ మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్ పెట్టగా, కూటమి ప్రభుత్వం మరో మూడింటికి బకాయి పెట్టింది. దీంతో మొత్తం ఆరు క్వార్టర్లతో బకాయిలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కొండలా పెరిగాయి. ఫలితంగా విద్యార్థులకు ఫీజుల కష్టాలు పెరిగాయి.
క్వార్టర్‌కు రూ.700 కోట్లు
ప్రభుత్వం ప్రతి సంవత్సరం నాలుగు విడతల్లో ఫీజులు విడుదల చేస్తుంది. ఒక్కో క్వార్టర్‌కు సుమారు రూ.700 కోట్ల చొప్పున చెల్లించాలి. ఆరు క్వార్టర్లకు రూ.4,200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ సకాలంలో ఫీజులు చెల్లించలేదు. ప్రతిసారీ కనీసం మూడు క్వార్టర్లు పెండింగ్ పెట్టేది. ప్రభుత్వం మారే నాటికి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు క్వార్టర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ హయాంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. దీనివల్ల ముందే తమకు ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడి చేసి మరీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేవి. దీంతో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు సంబంధం లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు ఇచ్చే విధానం తీసుకొచ్చింది. అయితే 2024-25 విద్యా సంవత్సరంలో కాలేజీలకు మొదటి క్వార్టర్ ఫీజులు మాత్రమే విడుదల చేశారు.
ఆ ఫీజులు ఎవరి ఖాతాలోకి?
2024-25 నుంచి ఫీజులు నేరుగా కాలేజీలకే విడుదల చేస్తున్నా.. అంతకుముందటి మూడు క్వార్టర్ల ఫీజులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అనేక మంది విద్యార్థులు అప్పట్లోనే సొంత డబ్బు చెల్లించగా.. కొందరు విద్యార్థులు ఇంకా కట్టాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఆ ఫీజులను తల్లుల ఖాతాల్లోనే వేయాలా? కాలేజీలకు విడుదల చేయాలా? అనేది అయోమయంగా మారింది. కాలేజీలకు విడుదల చేస్తే ఇప్పటికే కొందరు విద్యార్థులు చెల్లించినందున, యాజమాన్యాలు వారికి తిరిగిస్తాయా అనే అనుమానం ఉంది. ఒకవేళ తల్లుల ఖాతాల్లో జమ చేస్తే కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయిన విద్యార్థులు కాలేజీలకు చెల్లిస్తారా? అనేది మరో సందేహం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
సర్టిఫికెట్ల కోసం అప్పులు
ప్రభుత్వాలు సకాలంలో ఫీజులు ఇవ్వకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. ఫీజుల పెండింగ్‌తో ఆయా కుటుంబాలపై భారం పెరిగింది. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేటు కాలేజీలు తెగేసి చెబుతున్నాయి. సర్టిఫికెట్ల జారీ ఆపకూడదని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసినా యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అప్పులు చేసి మరీ విద్యార్థులు ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఆ స్తోమత లేని వారు సర్టిఫికెట్లు తీసుకోకుండా అక్కడే వదిలేశారు.
పీజీ కోర్సుల్లో చేరేందుకు పాట్లు
ఓవైపు ప్రైవేటు కాలేజీలు ఫీజులు కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వ అధీనంలోని యూనివర్సిటీ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఇవ్వకపోయినా తమకు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని వర్సిటీల అధికారులు విద్యార్థులకు స్పష్టం చేశారు. పీజీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు వర్సిటీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓ విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వాలని స్వయంగా మంత్రి లోకేశ్ పేషీ అధికారులు చెప్పినా నాగార్జున యూనివర్సిటీ అధికారులు లెక్క చేయలేదు. చివరికి ఆ విద్యార్థి అప్పుచేసి ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చింది.