AP High Court: పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:02 AM
పౌరులను అక్రమంగా నిర్బంధించి, చితకబాదడం పోలీసులకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎలాంటి నేరమైనా చట్టనిబంధనలు అనుసరించాల్సిందే: హైకోర్టు
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పౌరులను అక్రమంగా నిర్బంధించి, చితకబాదడం పోలీసులకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినా.. దొంగతం కేసు పెట్టినా పోలీసులు చట్టనిబంధనలు అనుసరించాల్సిందేనని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత కేసులో కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను స్టేషన్‌లో నిర్బంధించి కర్నూలు సీసీఎస్ పోలీసులు చితకబాదారని.. 2016లో ఘటన జరిగితే ఇప్పటికీ అతడు నడిచే పరిస్థితుల్లో లేడని తెలిపింది. హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడికి పాల్పడితే, తాము జోక్యం చేసుకుంటే తప్ప కేసు నమోదు చేయలేదని.. కేసు నమోదుకు జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ తర్వాత డీజీపీతో స్వయంగా మాట్లాడాక కేసు దర్యాప్తునకు అధికారిని నియమించారని.. ఆ సీఐని వీఆర్‌కు పంపించారని తెలిపింది. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉందని నిర్వేదం వ్యక్తం చేసింది. తనను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ యాదవ్ 2016లో ఫిర్యాదు చేశారని, 8ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. బాధితుడు పెట్టింది తప్పుడు కేసుగా పేర్కొంటూ.. పోలీసులు కేసును మూసివేస్తే సరిపోదని, సంబంధిత కోర్టులో ఆ మేరకు ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయాలని.. తప్పుడు కేసుగా సంబంధిత కోర్టు నిర్ధారించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. జిల్లా ఎస్పీ, సీసీఎస్ సీఐ హాజరుకు ఆదేశించిన తర్వాతే ఈ నెల 14న సంబంఽధిత కోర్టులో పోలీసులు తుది నివేదిక దాఖలు చేశారని, దాని ప్రతిని పిటిషనర్‌కు అందజేయాలని, తదుపరి వాయిదాలో తుది విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టులో హాజరు నుంచి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు, కర్నూలు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు మినహాయింపు ఇచ్చారు.