AP High Court: హోర్డింగ్స్ ఏర్పాటుపై పాలసీ ఉందా
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:27 AM
హోర్డింగ్స్, ఫ్లెక్సీల ఏర్పాటు, బహిరంగ ప్రకటనల విషయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలకు మార్గదర్శకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధానాన్ని(పాలసీ) రూపొందించిందా, అని హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక హోర్డింగ్స్ ఎన్ని?
పూర్తి వివరాలతో నివేదిక సమర్పించండి: హైకోర్టు
అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): హోర్డింగ్స్, ఫ్లెక్సీల ఏర్పాటు, బహిరంగ ప్రకటనల విషయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలకు మార్గదర్శకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధానాన్ని(పాలసీ) రూపొందించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. వర్షాలు, తుఫాన్లు వంటి విపత్తులు సంభవించిన సమయంలో వాటి వల్ల ప్రమాదాలు జరగకుండా సదరు పాలసీలో ఏమైనా జాగ్ర త్త చర్యలు పేర్కొన్నారా? అని ఆరా తీసింది. ఆయా వివరాలతో నివేదిక సమర్పించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘‘అధికారిక ప్రచార బోర్డులు/హోర్డింగ్‌లు/ఫ్లెక్సీలు/ఆర్చ్‌లు ఎన్ని ఏర్పాటయ్యాయి?. అవన్నీ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయా?. అనే విషయాన్ని నివేదికలో పొందుపరచండి. అనధికారిక/ప్రమాదకర హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి?. వాటిలో ఎన్ని పరిష్కరించారు?. వంటి వివరాలను కూడా అందులో చేర్చండి.’’ అని ఆదేశించింది. ఈ మేరకు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అనధికారికంగా వెలుస్తున్న హోర్డింగ్స్, బ్యానర్లను అధికారులు తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి 2018లో హైకోర్టులో పిల్ దాఖలు చేశా రు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం నగరాలు, పట్టణాలు ఉన్నది హోర్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కాదని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీ నాయకులే కాకుండా ప్రైవేటు వ్యక్తులు సైతం అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది. చట్టవిరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. హోర్డింగ్స్, ఫ్లెక్సీ బ్యానర్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా(అమికస్ క్యూరీ) న్యాయవాది వివేక్ చంద్రశేఖర్‌ను నియమించింది. తాజాగా మరోసారి ఈ పిల్ విచారణకు రాగా అమికస్ క్యూరీ సమర్పించిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.