Share News

AP High Court : దేవ్‌జీ, రాజిరెడ్డి పోలీసుల దగ్గరున్నారా?

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:04 AM

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టు...

AP High Court : దేవ్‌జీ, రాజిరెడ్డి పోలీసుల దగ్గరున్నారా?

  • అందుకు ఆధారాలున్నాయా..!

  • పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న

  • వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు నేటి వరకూ గడువు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. వారు ఇరువురూ పోలీసులు వద్ద ఉన్నారని నిరూపించేందుకు ఆధారాలు ఏమైనా ఉంటే, వాటిని కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించింది. ఇలాంటి వ్యాజ్యాలలో తాము జోక్యం చేసుకోవాలంటే ప్రాథమిక ఆధారాలు ఉండాలని ధర్మాసనం గుర్తు చేసింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడిన వీడియోను కోర్టు ముందు ఉంచేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ జి.తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవ్‌జీ తమ్ముడు తిప్పిరి గంగాధర్‌, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాది యు.జైభీమారావు వాదనలు వినిపిస్తూ... ఈనెల 18న మావోయిస్టులు-పోలీసులు మధ్య కాల్పులు జరిగాయన్నారు. ఈ సందర్భంగా దేవ్‌జీ, రాజిరెడ్డిలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిద్దరినీ కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)టి.విష్ణుతేజ స్పందిస్తూ... మావోయిస్టులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల అదుపులో లేరన్నారు. పోలీసులు అరెస్టు చేసిన మొత్తం 50 మంది మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చామన్నారు. పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘దేవ్‌జీ, రాజిరెడ్డి ఇద్దరూ పోలీసుల నిర్బంధంలో ఉన్నారని ఎలా చెబుతున్నారు? అందుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’ అని ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ... ‘దేవ్‌జీ, రాజిరెడ్డి సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలక నేతలు తమ అదుపులో ఉన్నారని ప్రకటన చేశారు. ఆ వీడియోను కోర్టు ముందు ఉంచుతాం’ అని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పేందుకు ఉన్న ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - Nov 21 , 2025 | 04:04 AM