Share News

AP High Court: బీచ్‌శాండ్‌ మైనింగ్‌పై వివరాలు సమర్పించండి

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:24 AM

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రైవేటు సంస్థ అల్లూవియల్‌ మినరల్స్‌కు అప్పగించడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు...

AP High Court: బీచ్‌శాండ్‌ మైనింగ్‌పై వివరాలు సమర్పించండి

  • రాష్ట్ర ప్రభుత్వం, ఖనిజాభివృద్ధి సంస్థకు హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రైవేటు సంస్థ అల్లూవియల్‌ మినరల్స్‌కు అప్పగించడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను హైకోర్టు ఆదేశించింది. మైనింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రైవేటు సంస్థకు ఎంత శాతం చెల్లిస్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వాయిదా వేశారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన పొన్నెకంటి మల్లికార్జునరావు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలోనే మైనింగ్‌ కార్యకలాపాలు జరగాలి. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ 2023 డిసెంబరు 14న జారీ చేసిన టెండర్‌లో బిడ్డింగ్‌లో విజయం సాధించిన కంపెనీకి మినరల్‌ షేర్‌లో 92శాతం, ఖనిజాభివృద్ధి సంస్థ 8శాతం పొందొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థకు లబ్ది చేకూర్చి, రాష్ట్ర రెవెన్యూకు నష్టం చేస్తుంది’ అని వివరించారు.ఏపీఎండీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను పూర్తిగా ప్రైవేట్‌ సంస్థకు అప్పగించామన్న పిటిషనర్‌ వాదనలో వాస్తవం లేదు. ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ విషయంలో ప్రైవేటు సంస్థ ఏపీఎండీసీకి సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఏపీఎండీసీ పర్యవేక్షణలోనే బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కార్యకలాపాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

Updated Date - Oct 16 , 2025 | 06:24 AM