AP High Court: మద్యం నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై లోతైన విచారణ అవసరం
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:18 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందనప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ...
రాతపూర్వక వాదనలను ఇవ్వండి
సమర్థించే తీర్పులనూ జతచేయండి
సీఐడీ, నిందితులకు హైకోర్టు ఆదేశాలు
తదుపరి విచారణ 17కు వాయిదా
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందనప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను రాతపూర్వకంగా కూడా అందజేయాలని ఇరువర్గాలకు సూచించింది. వాదనలను బలపర్చే తీర్పులను కూడా జత చేయాలని స్పష్టం చేసింది. విచారణను సెప్టెంబరు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్, సప్లమెంటరీ చార్జిషీట్ అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 6న పొరపాటున డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. అలాగే ఇదే కేసులో నిందితుడు బూనేటి చాణిక్య(ఏ8) వేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిలువరించాలంటూ హైకోర్టులోనే మరో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.... సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్ల పై ఆగస్టు 23న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమోరాండంతో పాటు బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాలపై స్టే విధించారు. నిందితులకు నోటీసులు జారీ చేశారు.
గురువారం పిటిషన్లు మరోసారి విచారణకు రాగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితులందరికీ నోటీసులు అందజేశామని, ట్రయల్ కోర్టు డాకెట్ ఉత్తర్వులను ఫైల్ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బూనేటి చాణిక్య తరఫున సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చాణిక్య పిటిషన్‌ను వేరుగా విచారించాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... రాతపూర్వక వాదనలు కూడా సమర్పించాలని సీఐడీ, నిందితుల తరఫు న్యాయవాదులను ఆదేశించారు.