AP High Court: వీహెచ్‌ఏ పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:32 AM
గ్రామ సచివాలయాల పరిధిలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ల(వీహెచ్‌ఏ) నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
నియామక ప్రక్రియ మధ్యలో రూల్స్ మార్పు చట్టవిరుద్ధం
మెరిట్ ఆధారంగా పిటిషనర్లకు సీనియారిటీ కల్పించాలి
3నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల పరిధిలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ల(వీహెచ్‌ఏ) నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నియామక ప్రక్రియ ప్రారంభమైన తరువాత అర్హత ప్రమాణాలు మార్చడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. కొత్త సర్వీస్ రూల్స్ అమల్లోకి రాకముందే వీహెచ్‌ఏ పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిందని గుర్తు చేసింది. ఆట మొదలైన తరువాత రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో కొత్త సర్వీస్ రూల్స్‌ను పూర్వ తేదీ నుంచి(రెట్రోస్పెక్టివ్) అమలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రాత పరీక్షలో అర్హత సాధించిన పిటిషనర్లను పరిగణనలోకి తీసుకొని తాజాగా మెరిట్ జాబితాను ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల కంటే పిటిషనర్లు మెరిట్ సాధించి ఉంటే భవిష్యత్తు పదోన్నతుల్లో వారికి నష్టం జరగకుండా నోషనల్ సీనియార్టీ కల్పించాలని సూచించింది. ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు ఇచ్చారు. 2019 జూలైలో మొత్తం 4వేల విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జరీ చేసింది. బీఎస్సీ(హార్టికల్చర్,)/బీఎస్సీ(హానర్స్), బీటెక్(హార్టికల్చర్), హార్టికల్చర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. అనంతరం ఎంపిక పరీక్షలో 2,217 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 1,783 పోస్టుల భర్తీకి 2020లో మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
అనంతరం హార్టికల్చర్ శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు(ఎంపీఈవో), మైక్రో ఇరిగేషన్ అసిస్టెంట్ ఆఫీసర్స్(ఎంఐఏవో) అభ్యర్థన మేరకు అర్హత ప్రమాణాలను సడలిస్తూ సవరణ జారీ చేసింది. బీఎస్సీ(బీజడ్‌సీ)/బీఎస్సీ/ఎమ్మెస్సీ(హార్టికల్చర్ ఒక సబ్జెట్‌గా ఉన్నవారు), అలాగే 10+2తో ఒక సంవత్సరం హార్టికల్చర్ డిప్లొమా, బీఎస్సీ(అగ్రికల్చర్) చేసినవారిని కూడా పరీక్ష రాసేందుకు అనుమతించింది. అయితే రాత పరీక్షకు 5 రోజుల ముందు 2020 జూన్‌లో కొత్త సర్వీస్ రూల్స్ తీసుకొస్తూ.. అర్హత ప్రమాణాల సడలింపును రద్దు చేసింది. కొత్త సర్వీస్ రూల్స్‌ను వెనుక తేదీ(రెట్రోస్పెక్టీవ్) నుంచి అమలు చేసింది. దీంతో పరీక్ష రాసే అర్హత కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జీవీ శివాజీ, వై.మల్లికార్జునరెడ్డి, హరీశ్‌కుమార్ రాశినేని వాదనలు వినిపించారు.