Share News

AP High Court: పీపీపీ ఆపలేం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:08 AM

రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

AP High Court: పీపీపీ ఆపలేం

  • అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం

  • చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం

  • టెండర్‌ పక్రియ ఆగేలా ఉత్తర్వులివ్వలేం

  • మెడికల్‌ కాలేజీలపై తేల్చిచెప్పిన హైకోర్టు

  • కౌంటర్‌ దాఖలుకు సర్కారుకు సమయం

  • థర్డ్‌ పార్టీకి హక్కులివ్వకుండా చూడాలన్న

  • పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని తేల్చిచెప్పింది. పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ)తో మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. కాలేజీలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?. దీని వల్ల లాభనష్టాలు ఏంటి?. అన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ‘‘పీపీపీ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది. ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టబడిదారులు హడావుడిగా రారుకదా!’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తరువాత అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. కౌంటర్‌ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


స్టే ఇవ్వండి!

రాష్ట్రంలోని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్‌ కాలేజీలను పీపీపీతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల 9న ప్రభుత్వం జీవో 590ని జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరుజిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ కుర్రా వసుంధర హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. శ్రీరామ్‌, న్యాయవాది అశోక్‌రామ్‌ వాదనలు వినిపించారు. ‘‘లాభ, నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను 33ఏళ్ల పాటు థర్డ్‌ పార్టీకి అప్పగించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు రూ.వేల కోట్లు ఆర్జిస్తారు. ఇప్పటికే పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా కోర్టు స్టే ఇవ్వాలి’’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆసుపత్రుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని, కాలేజీల నిర్మాణం ఏదశలో ఉందని ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వాదనలు వినిపిస్తూ.. ‘‘మొత్తం 17 మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.8,500 కోట్లు అవసరం. పులివెందుల మెడికల్‌ కాలేజీ నిర్మాణం 80 శాతం పూర్తయింది. మిగిలిన కాలేజీల నిర్మాణాలు 20-30శాతం మాత్రమే జరిగాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి వ్యవహారం టెండర్ల దశలో ఉంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు’’ అని ధర్మాసనాన్ని కోరారు.

Updated Date - Oct 30 , 2025 | 04:10 AM