Share News

AP High Court: పిన్నెల్లి సోదరులకు ఝలక్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:11 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం...

AP High Court: పిన్నెల్లి సోదరులకు ఝలక్‌

  • టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

  • నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్‌ వాదనలో బలం ఉంది: హైకోర్టు

అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం వారు దాఖలుచేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు శుక్రవారం తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేవరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించిన తర్వాత ఆ తరహా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. పిటిషన్లను కొట్టివేసిన అనంతరం అప్పీల్‌ వేసుకునే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తుచేశారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి సోదరులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం హైకోర్టు తుది విచారణ జరిపింది. పోలీసుల తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు తోట ఆంజనేయులు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం వెలువరించారు.


తీర్పులో ఏముందంటే...

‘టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యల వెనుక కీలక కుట్రదారులు పిన్నెల్లి సోదరులేననేది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తే ఈ రెండు క్రూరమైన హత్యలకు జరిగిన నేరపూరిత కుట్రలో పిటిషనర్లకు భాగస్వామ్యం ఉందన్న ప్రాసిక్యూషన్‌ వాదనలో బలం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించేటప్పుడు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నేర తీవ్రత, ఆధారాలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. హత్య ఘటనలో కీలక కుట్రదారులుగా ఉన్న పిటిషనర్లు ఇప్పటివరకు అరెస్టు కాలేదు. వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించడం అత్యంత ముఖ్యం. దురుద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని, స్వేచ్ఛను దుర్వినియోగం చేయరంటూ ప్రాఽథమిక అభిప్రాయానికి వచ్చి.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలి. హత్య కేసుల్లో దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదని పలు తీర్పులు ఉన్నాయి. ముందస్తు బెయిల్‌ మంజూరుకు పిటిషనర్ల హోదా ముఖ్యం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిటిషనర్లు అనర్హులు. ఈ నేపఽథ్యంలో వ్యాజ్యాలను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:12 AM