AP High Court: సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లిప్తతా
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:22 AM
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పన విషయంలో అధికారుల నిర్లిప్తతపై హైకోర్టు మండిపడింది. జిల్లాస్థాయిలో అధికారులు హాస్టళ్లను సందర్శించి...
వాటి దుస్థితి తెలియనట్లు ఉంటారా?
అధికారులపై హైకోర్టు మండిపాటు
మౌలిక వసతులు మెరుగవకుంటే ముఖ్యకార్యదర్శులను బాధ్యులను చేస్తాం
వసతుల కల్పనపై ప్రతి నెల నివేదికలు ఇవ్వండి
సీఎస్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ వచ్చేనెలకు వాయిదా
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పన విషయంలో అధికారుల నిర్లిప్తతపై హైకోర్టు మండిపడింది. జిల్లాస్థాయిలో అధికారులు హాస్టళ్లను సందర్శించి, పరిస్థితులు చక్కదిద్దకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. హాస్టళ్లలో పరిస్థితులు దయనీయంగా ఉంటే అధికారులు ఏమీ తెలియనట్లు ఎలా ఉంటున్నారని నిలదీసింది. నిర్వహణకు ఏటా ఖర్చుచేస్తున్న కోట్లాది రూపాయలు ఎటుపోతున్నాయి? కాంట్రాక్టర్ల లబ్ధికోసం పనులు చేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు బెడ్లు అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంట్లో మన చిన్నారులను కింద పడుకోపెడతామా? అని సూటిగా ప్రశ్నించింది. బెడ్లు లేదా పరుపులు అందించేందుకు అవసరమైతే అదనపు బడ్జెట్ కేటాయించాలని సీఎస్ విజయానంద్‌కు సూచించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్‌సీపీసీఆర్) మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, బెడ్లు, బెడ్ షీట్లు, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేసింది. హాస్టళ్లలో వసతులను మెరుగుపరిచే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సాంఘిక, బీసీ, గురుకుల సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. మీరు జోక్యం చేసుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదని, వ్యక్తిగత హాజరుకు అందుకే ఆదేశించామని సీఎ్‌సను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జిల్లాస్థాయిలో సీనియర్ అధికారులు క్రమంతప్పకుండా హాస్టళ్లను తనిఖీ చేసేలా చూడాలని పేర్కొంది. సంబంధిత అధికారుల పేర్లు, ఎప్పుడెప్పుడు వారు హాస్టళ్లను సందర్శించారనే వివరాలను కోర్టు ముందు ఉంచాలని, వసతుల మెరుగుదలకు సంబంధించి స్థాయీ నివేదికలను ప్రతీనెల తమ ముందుంచాలని సీఎ్‌సను ఆదేశించింది. తదుపరి విచారణను నెలరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
పనులు జరుగుతున్నాయి: సీఎస్
సంక్షేమ హాస్టళ్లలో మౌలికసదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ గత విచారణల సందర్భంగా, ప్రతీ జిల్లాలో కనీసం 5 సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ధర్మాసనం ఆదేశించింది. వారిచ్చిన నివేదికలను చూసి హాస్టళ్లలో దుస్థితిపై విస్మయం వ్యక్తం చేసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలతో తమ ముందు హాజరుకావాలని సీఎ్‌సను ఆదేశించింది. సోమవారం విచారణకు సీఎస్ విజయానంద్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. నివేదికను పరిశీలిస్తే వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు లేనట్లు తేలిందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి దురదృష్టకరమని చెప్పారు. విజయనగరం జిల్లాలోని అంధుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సీఎస్ విజయానంద్ బదులిస్తూ.. సంక్షేమ హాస్టళ్లలో వసతుల మెరుగుదలపై అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించానన్నారు. అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణంతో పాటు హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. టెండర్లు పిలిచామని, కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. వచ్చే ఏడాది, రెండేళ్లలో చేపట్టే పనుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. పరుపులు అందించే నిబంధన లేదని, విద్యార్థులు పడుకొనేందుకు వీలుగా కార్పెట్లు, మందపాటి దుప్పట్లు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి స్పంది స్తూ.. ఈ ఏడాది జనవరిలో నర్సీపట్నం హాస్టల్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు సందర్శించినపుడు మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం అవి అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. విజయనగరం అంధుల పాఠశాలకు డిప్యుటేషన్ విధానంలో సహాయకులను నియమించామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జి.అరుణ్‌శౌరి వాదనలు వినిపిస్తూ... వసతులు మెరుగుపర్చేందుకు సరిపడా నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.