Share News

AP High Court: ఎస్‌ఐ నిజంగా సెలవులోనే ఉన్నారా

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:17 AM

ప్రాసిక్యూషన్స్‌ పూర్వ డైరెక్టర్‌ జల్లా సుదర్శన్‌రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారనే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన నోటీసులను స్వీకరించే విషయంలో...

AP High Court: ఎస్‌ఐ నిజంగా సెలవులోనే ఉన్నారా

  • రిజిస్టర్‌ తెప్పించి హాజరు పరిశీలిస్తాం: హైకోర్టు

  • కోర్టు నోటీసు స్వీకరణలో ఎస్‌ఐ వైఖరిని తప్పుబట్టిన ధర్మాసనం

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రాసిక్యూషన్స్‌ పూర్వ డైరెక్టర్‌ జల్లా సుదర్శన్‌రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారనే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన నోటీసులను స్వీకరించే విషయంలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ మోహన్‌ వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. ఆ ఎస్‌ఐ వారంరోజులుగా సెలవులో ఉన్నారని అక్నాలడ్జ్‌మెంట్‌పై పోస్టుమెన్‌ పేర్కొనడంపై సందేహం వ్యక్తం చేసింది. అధికారి సూచించకుండా అక్నాలడ్జ్‌మెంట్‌పైౖ ఆ విధంగా రాసేందుకు దేశంలో ఏ పోస్టుమెన్‌కైనా ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించింది. ఇది నమ్మశక్యంగా లేదని పేర్కొంది. ఆ ఎస్‌ఐ సెలవులో ఉన్నారా?లేదా? తేల్చేందుకు హాజరు రిజిస్టర్‌ తెప్పించుకుంటామని హెచ్చరించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ స్పందిస్తూ... అసలు ఏమి జరిగిందో తెలసుకొని, వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఎస్‌ఐకి నోటీసులు అందినట్లుగానే భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేస్తారా?లేదా? అనేది ఎస్‌ఐ ఇష్టమని తెలిపింది. తదుపరి విచారణ నాటికి ప్లీడింగ్స్‌ పూర్తి చేయాలని ఇరువైపుల న్యాయవాదులను ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Aug 19 , 2025 | 06:18 AM