Share News

AP High Court: రాష్ట్ర సిట్‌ దర్యాప్తు చేస్తోంది కదా

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:57 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం చేశారని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో...

AP High Court: రాష్ట్ర సిట్‌ దర్యాప్తు చేస్తోంది కదా

  • ఆలస్యం చేస్తుందని ఎందుకు భావిస్తున్నారు: హైకోర్టు

  • జగన్‌పై ఔదార్యం చూపుతుందని ఎందుకు అనుకుంటున్నారు?

  • పిటిషనర్‌ మెహక్‌ మహేశ్వరికి ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం చేశారని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్‌ వేసిన ఢిల్లీ న్యాయవాది మెహక్‌ మహేశ్వరికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ ఏర్పాటు చేసిందని గుర్తుచేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులతో వేరే సిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేసింది. ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణ జరుపలేమని స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ మెతక వైఖరి అవలంబిస్తుందని.. దర్యాప్తులో ఆలస్యం చేస్తుందని దేని ఆధారంగా మీరు విశ్వసిస్తున్నారని ప్రశ్నించింది. మాజీ సీఎం జగన్‌పై సిట్‌ ఔదార్యం చూపుతుందని ఎందుకు అనుకుంటున్నారని అడిగింది. ‘‘మీలాంటి బిజీ లాయర్‌ ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’గా ఢిల్లీ నుంచి వచ్చి.. సొంత డబ్బులు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పిల్‌ దాఖలు చేసిన విధానంపై సంతృప్తికరంగా లేం. ఈ దశలో ప్రతివాదులకు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేం’’ అని స్పష్టం చేసింది. అసలీ పిల్‌ను ఎందుకు విచారించాలో చెప్పాలని ఆయన్ను ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై వివరాలు సమర్పించాలని ఎస్‌జీపీ ప్రణతిని కూడా ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


ఖజానాకు లక్షల కోట్ల నష్టం..!

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ జమానాలో వనరులను కొల్లగొట్టి ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం చేయడంపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్‌ మహేశ్వరి పిల్‌ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను సిట్‌లో సభ్యులుగా నియమించాలని కోరారు. అక్రమాస్తులు కలిగి ఉన్న జగన్‌, తదితరులపై నిష్పాక్షిక దర్యాప్తునకు వీలుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా మెహక్‌ మహేశ్వరి వాదనలు వినిపించారు. ‘వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసింది. వేల కోట్ల స్కాం జరిగిందని అందులో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులతో ఏర్పాటైన సిట్‌తో అవినీతిపై దర్యాప్తు జరిపించాలి’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏమీ జరగడం లేదా అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులను అందులో చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పిటిషనర్‌ బదులిస్తూ.. రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలకు కేసును దర్యాప్తు చేసే సామర్థ్యం లేదన్నారు. వేల కోట్లతో కూడిన ఈ వ్యవహారం ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతం విస్తరించి ఉండవచ్చని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘ఆ విషయాన్ని మీరెలా చెబుతున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? శ్వేతపత్రాల ఆధారంగా పిల్‌పై విచారణ జరుపలేం’ అని స్పష్టం చేసింది. న్యాయవాది స్పందిస్తూ.. నిజంగా అవినీతి జరిగిందా? లేక రాజకీయ ప్రతీకారంతో సిట్‌ ఏర్పాటు చేశారా అనే విషయమై స్పష్టత లేదన్నారు.


ఆ వ్యవహరంతో మీకేం సంబంధమని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ మెతక వైఖరి అవలంబిస్తుందని, దర్యాప్తులో ఆలస్యం చేస్తుందని దేని ఆధారంగా విశ్వసిస్తున్నారని అడిగింది. ‘ఏడాది కాలంగా మద్యం కుంభకోణం కేసులోనే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజుకూ మాజీ సీఎం జగన్‌ను చార్జిషీటులో నిందితుడిగా చేర్చలేదు’ అని న్యాయవాది బదులిచ్చారు. మాజీ సీఎం విషయంలో ఔదార్యం చూపుతున్నారని భావిస్తున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎస్‌జీపీ ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించేందుకు సమయం కోరగా.. ధర్మాసనం విచారణను వచ్చేఏడాది ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.

Updated Date - Aug 07 , 2025 | 05:00 AM