AP High Court: హాయ్‌ల్యాండ్‌లో 65 రోజులు ఏం చేశారు
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:48 AM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశ్నపత్రాల మూల్యాంకనం విషయంలో హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగిందనేది బయటపెట్టకుండా ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోంది.. అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది
20లక్షలు ఖర్చు చేశారు.. పోలీసులను పెట్టారు.. సింగిల్ జడ్జి తీర్పుపై
అప్పుడే ఫిర్యాదు చేయలేదేం?.. ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు
పీఎ్‌సఆర్‌పై సిట్ దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలి: ఏజీ విజ్ఞప్తి
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశ్నపత్రాల మూల్యాంకనం విషయంలో హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగిందనేది బయటపెట్టకుండా ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్ వేదికగా జవాబుపత్రాల మూల్యాంకనం జరిగిందా....లేదా అనేది ప్రస్తుత కేసులో కీలకాంశమని గుర్తుచేసింది. జవాబుపత్రాలను మూల్యాంకనం చేయకుంటే 65 రోజులు అక్కడ ఏమి చేశారని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్‌లో పోలీస్ సిబ్బందిని సెక్యూరిటీగా ఏర్పాట్లు చేసినట్లు, రూ 20లక్షల ఖర్చు చేసినట్లు రికార్డుల్లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఉండగా జరిగిన గ్రూపు-1 మెయిన్స్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, హ్యాయ్‌లాండ్ వేదికగా ఆనాడు పలువురు గృహిణులను, చివరకు ఆటో డ్రైవర్లను కూడా ఈ ప్రక్రియలో భాగం చేశారనే ఆరోపణలను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024 మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దుచేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎంపిక అయిన అభ్యర్థులు, ఏపీపీఎస్సీ వేసిన అప్పీళ్ల పై గురువారం హైకోర్టు ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. తీర్పు వెలువడిన వెంటనే ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఏడాది సమయం ఎందుకు తీసుకున్నారని ఈ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. వేలమంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫు వాదనలు ముగియడంతో ఎంపికకాని అభ్యర్థుల తరఫు వాదనల కోసం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా...ఏపీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘‘2021 డిసెంబరు నుండి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్‌ల్యాండ్‌లో తొలిసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగిందన్న పిటిషనర్ల వాదనను వ్యతిరేకిస్తూ ఏపీపీఎస్సీ కౌంటర్ దాఖలు చేసింది. 2022 మార్చి-మేలో మాత్రమే ఏపీపీఎస్సీ కార్యాలయం, రెండు ప్రభుత్వ కళాశాలల్లో మూల్యాంకనం జరిగినట్లు ఆ కౌంటరులో పేర్కొంది. అప్పటి కార్యదర్శి పీఎ్‌సఆర్ వచ్చిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చేవరకు వేచి చూడాలి’’ అని ఆయన కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి.శ్రీరఘురాం, ఓ.మనోహర్‌రెడ్డి, న్యాయవాదులు శ్రీకాంత్, జీవీరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందనేందుకు ఆధారాలు లేవు. ఈ విషయంలో సింగిల్ జడ్జి పొరపాటుపడ్డారు. తీర్పు రద్దు చేయండి’’ అని కోరారు. ఎంపికకాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది శివ వాదనలు వినిపించారు. ‘‘హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగడం వాస్తవం. ఆ ఫలితాలను ఏపీపీఎస్సీ తొక్కిపెట్టింది. అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు కంటితుడుపుచర్యగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు’’ అని వాదించారు.
అసలేం జరిగిందంటే..?
గ్రూపు-1 మెయిన్స్ కోసం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మాన్యువల్‌గా ప్రశ్నాపత్రాలను మూల్యాంకం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, కరోనాను కారణంగా చూపించి ఆప్రక్రియను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పూర్తిచేసింది. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, నోటిఫికేషన్‌లో పేర్కొనట్టు మాన్యువల్‌గా మూల్యాంకనం జరపాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు 2021 డిసెంబరు- 2022 ఫిబ్రవరి మధ్యలో హ్యాయ్‌లాండ్‌కు ప్రశ్నాపత్రాలు తరలించి అడ్డగోలుగా ఆప్రక్రియను ‘మమ’ అనిపించారని ఆరోపణలొచ్చాయి. ఆయనపై కేసు నమోదైంది.