AP High Court: తురకా కిశోర్ కేసు డైరీని మా ముందు ఉంచండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:30 AM
వైసీపీ నేత తురకా కిశోర్‌పై పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన డైరీతో సహా మొత్తం రికార్డులను తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
రెంటచింతల పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత తురకా కిశోర్‌పై పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన డైరీతో సహా మొత్తం రికార్డులను తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిశోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సురేఖ సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి, పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపించారు.