AP High Court: కస్టోడియల్ టార్చర్‌పై అఫిడవిట్ వేయండి
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:06 AM
తన కుమారుడు హరికృష్ణను పోలీసులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని తండ్రి ఎల్లయ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.
పల్నాడు ఎస్పీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): తన కుమారుడు హరికృష్ణను పోలీసులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని తండ్రి ఎల్లయ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మే 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీ్‌సస్టేషన్ నుంచి తంగేడు గ్రామ సమీప చెన్నయ్య పాలెం వరకు సీసీటీవీ ఫుటేజ్‌ను తమ ముందు ఉంచాలని దాచేపల్లి పోలీసులను ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. హరికృష్ణను పల్నాడు జిల్లా దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, ఎస్‌ఐ సౌందర్య రాజు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ తంగేడు గ్రామానికి చెందిన యు.ఎల్లయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.