AP High Court: ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించండి: హైకోర్టు
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:25 AM
స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఽఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఽఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంతోపాటు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ సమర్పించిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే డీజీపీకి పంపించిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని డిప్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించడంతో పాటు సీసీటీవీలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్వతంత్ర పర్యవేక్షకులను నియమించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్ వాదనలు వినిపించారు.