Share News

AP High Court: తురకా కిశోర్‌ను తక్షణమే విడుదల చేయండి

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:12 AM

వైసీపీ మాచర్ల నేత తురకా కిశోర్‌ అరెస్టులో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదని, రిమాండ్‌ విధించేటప్పుడు మేజిస్ట్రేట్‌ సైతం మైండ్‌ అప్లయ్‌ చేయలేదని హైకోర్టు...

AP High Court: తురకా కిశోర్‌ను తక్షణమే విడుదల చేయండి

  • తుది తీర్పునకు లోబడే ఈ ఉత్తర్వులు: హైకోర్టు

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాచర్ల నేత తురకా కిశోర్‌ అరెస్టులో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదని, రిమాండ్‌ విధించేటప్పుడు మేజిస్ట్రేట్‌ సైతం మైండ్‌ అప్లయ్‌ చేయలేదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కిశోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ విడుదల ఉత్తర్వులు ప్రస్తుత వ్యాజ్యంలో తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కిశోర్‌ అరెస్టుతో రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విలక్షణమైన పోలీసు తరహా కేసుగా అభివర్ణించింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త కిశోర్‌ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని.. కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం కిశోర్‌ అరెస్టుతో పాటు మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ ఉత్తర్వులను తప్పుపట్టింది. కిశోర్‌ అరెస్టు సమయంలో బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 47 ప్రకారం.. అరెస్టుకు గల కారణాలను, అందుకు దారితీసిన పరిస్థితులను రాతపూర్వకంగా అందజేయలేదని, కేవలం మౌఖికంగా తెలియపరచారని పేర్కొంది. ప్రస్తుత వ్యవహారం నిందితుడి స్వేచ్ఛతో ముడిపడిఉన్న నేపథ్యంలో కిశోర్‌ రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Aug 08 , 2025 | 05:14 AM