Share News

AP High Court: యాక్సిస్‌తో పీపీఏపై పూర్తి వివరాలివ్వండి

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:25 AM

యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఎ్‌సపీడీసీఎల్‌ చేసుకున్న ఒప్పందాని(పీపీఏ)కి ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలుపడాన్ని సవాల్‌ చేస్తూ...

AP High Court: యాక్సిస్‌తో పీపీఏపై పూర్తి వివరాలివ్వండి

  • కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశం.. సీఎస్‌, డిస్కం సీఎండీకి నోటీసులు

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఎ్‌సపీడీసీఎల్‌ చేసుకున్న ఒప్పందాని(పీపీఏ)కి ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలుపడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై పూర్తి వివరాలివ్వాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌, ఏపీఎ్‌సపీడీసీఎల్‌ సీఎండీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ నుంచి విద్యుత్‌ యూనిట్‌ రూ.4.68 చొప్పున కొనుగోలుకు ఏపీఎ్‌సపీడీసీఎల్‌ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఈ ఏడాది మే 2న ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది గోచిపాత శ్రీనివాసరావు పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.3.10-3.60కే లభ్యమవుతుంటే.. ఎస్‌పీడీసీఎల్‌ రూ.4.68కి కొనుగోలు చేస్తుందన్నారు. 25ఏళ్ల పాటు యాక్సిస్‌ ఎనర్జీ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ వద్ద అప్పీల్‌ వేసుకోవాలని సూచించింది. ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేకపోతేనే తాము జోక్యం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. పిల్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి అన్నారు. ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు.

Updated Date - Sep 18 , 2025 | 05:26 AM