Share News

AP High Court: ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులపై..జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:58 AM

అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తమకిచ్చిన ఇచ్చిన షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ బి.ఫణికుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది.

AP High Court: ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులపై..జోక్యం చేసుకోలేం

  • అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించారు: హైకోర్టు

  • సాక్షి ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌ వ్యాజ్యాలు కొట్టివేత

  • షోకాజ్‌ నోటీసు వివిధ దశలను అధిగమించాలి

  • వారి వివరణ తీసుకుని విచారణ ముగించాలని శాసనసభకు కమిటీ సిఫారసు చేయొచ్చు

  • వారు చూపే ఆధారాలను బట్టి విచారణను ముగించే స్వాతంత్య్రం సభకు ఉంటుంది

  • కమిటీ నిర్ణయంపై న్యాయసమీక్ష జరపొచ్చు

  • తీర్పులో న్యాయమూర్తి వెల్లడి

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తమకిచ్చిన ఇచ్చిన షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ బి.ఫణికుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ఆ పత్రిక ప్రచురించిన కథనంపై వివరణ కోరుతూ ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసు వివిధ దశలను అధిగమించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని విచారణను నిలిపివేయాలని కమిటీ శాసనసభకు సిఫారసు చేయవచ్చని తెలిపింది. ఒకవేళ పిటిషనర్లకు వ్యతిరేకంగా అది సిఫారసు చేసినప్పటికీ.. వారు సమర్పించిన ఆధారాలు, వివరణను పరిగణనలోకి తీసుకుని సభ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 194 (శాసనసభ హక్కులు), అధికరణ 19(1ఏ)(వాక్‌ స్వాతంత్రం) మధ్య ఉన్న పరస్పర సంబంధం తేల్చే వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉందనే కారణంతో ప్రివిలేజ్‌ కమిటీ వద్ద ప్రక్రియను నిలుపుదల చేయడానికి వీల్లేదన్న అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్లు అపరిపక్వదశలో కోర్టును ఆశ్రయించారని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ మంగళవారం తీర్పు వెలువరించారు.


ఏం జరిగింది..?

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23 తేదీలలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇవి వాయిదా పడడంతో కోట్లు రూపాయలు వృధా చేశారని పేర్కొంటూ ‘కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు’ అనే శీర్షికతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉందని, ప్రచురణ వెనుక దురుద్దేశం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే జి.జయసూర్య ఫిబ్రవరి 25న స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించారు. దీంతో ఆ కమిటీ సదరు పత్రికకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కథనం ప్రచురణపై వివరణ కోరుతూ శాసనసభ సెక్రెటరీ జనరల్‌ జూన్‌ 3న సాక్షి యాజమాన్యం, ఎడిటర్‌, ప్రింటర్‌, పబ్లిషర్‌కు లేఖ రాశారు. ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసును, సెక్రెటరీ జనరల్‌ రాసిన లేఖను సవాల్‌ చేస్తూ ఆ పత్రిక ఎడిటర్‌ రక్కసి ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ బి.ఫణి కుమార్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్లు ప్రచురించిన కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందికి రాదన్నారు. అందులో సభలో జరిగిన ప్రొసీడింగ్స్‌ గురించి గానీ, సభలోని సభ్యులను అవమానపరుస్తూ గానీ ఎలాంటి ప్రస్తావనలూ లేవని తెలిపారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రివిలేజ్‌ కమిటీ షోకాజ్‌ నోటీసులపై ప్రాఽథమిక దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం వెల్లడించారు.


న్యాయసమీక్షకు లోబడే కమిటీ నిర్ణయం

ప్రివిలేజ్‌ మోషన్‌ కింద చట్ట సభల్లో తీసుకునే నిర్ణయాలు సైతం దేశంలోని చట్టబద్ధ పాలనకు లోబడి ఉండాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ‘పార్లమెంటు, శాసనసభలు, వాటి అనుబంధ కమిటీల్లో ఉన్న సభ్యులు.. చట్టసభలను తమను తాము రక్షించుకునే దీవులుగా వినియోగించుకోలేరని సీతా సొరేన్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రివిలేజ్‌ మోషన్‌ కింద చట్టసభలు తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. రాజ్యాంగ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ప్రివిలేజ్‌ కమిటీ సదరు కథనంపై సరైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. కోర్టు న్యాయసమీక్ష జరిపే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత.. తమ హక్కులకు భంగం కలిగిందని చెప్పేవారిపైనే ఉంటుంది. రాజ్యాంగంలోని 194, 19(1ఏ) మధ్య ఉన్న పరస్పర సంబంధం అంశం తేల్చే వ్యవహారం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందనే కారణంతో ప్రివిలేజ్‌ కమిటీ వద్ద ప్రక్రియను నిలుపుదల చేయడానికి వీల్లేదన్న ఏజీ వాదనతో ఏకీభవిస్తున్నాం. అపరిపక్వ దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారు’ అని స్పష్టంచేస్తూ పిటిషన్లను కొట్టివేశారు.

Updated Date - Nov 05 , 2025 | 05:00 AM