AP High Court: సెమిస్టర్‌కు కనీస హాజరు ఉండాల్సిందే
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:08 AM
బీటెక్ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీస హాజరుశాతం తప్పనిసరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
పరీక్షలకు సంబంధించిన నిబంధన సరైందే
బీటెక్‌పై హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): బీటెక్ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీస హాజరుశాతం తప్పనిసరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జేఎన్‌టీయూ కాకినాడ, జీఎంఆర్‌ఐటీ రూపొందించిన నిబంధనలను సమర్థించింది. కనీస హాజరు నిబంధన సహేతుకం కాదని, ఏకపక్షం అంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు చట్టం ముందు నిలబడవని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పులోని ఈ భాగాన్ని రద్దు చేసింది. అయితే, ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాల మేరకు విద్యార్థి కౌశిక్ తన 4, 5వ సెమిస్టర్‌ను కొనసాగించారని గుర్తు చేసింది. కౌశిక్ 4, 5 సెమిస్టర్లను రద్దు చేసి, తిరిగి ఆయనను 3వ సెమిస్టర్‌కు పంపించడం సముచితం కాదని అభిప్రాయపడింది. ఇలా చేయడం వల్ల కౌశిక్ అకడమిక్ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అకడమిక్ రెగ్యులేషన్ 9(ఐ)(జే) ప్రకారం మేకప్ క్లాస్‌లకు హాజరుకావడం ద్వారా తగిన హాజరుశాతం సాధిస్తే పరీక్ష రాసేందుకు అర్హత సాధించవచ్చని గుర్తు చేసింది. హాజరులోపాన్ని సరిదిద్దుకునేందుకు వీలుగా మేకప్ క్లాస్‌లకు హాజరుయ్యేందుకు కౌశిక్‌ను అనుమతించింది. ఈ తీర్పుని ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదని స్పషం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో బీటెక్(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అభ్యసిస్తున్న బీవీకే కౌశిక్ అనారోగ్యం కారణంగా తరగతులకు హాజరుకాలేకపోయాడు. హాజరుశాతం 65ు కన్నా తక్కువగా ఉందనే కారణంతో కళాశాల యాజమాన్యం ఆయనను మూడవ సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో కౌశిక్ హైకోర్టును ఆశ్రయించగా, పరీక్షలు రాసేందుకు అనుమతించిన కళాశాల యాజమాన్యం, ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో మూడవ సెమిస్టర్ ఫలితాలు వెల్లడించడంతో పాటు నాలుగవ సెమిస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతించేలా కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ కౌశిక్ మరో పిటిషన్ దాఖలు చేశారు