Share News

Advocate Sidharth Luthra: బెయిలిస్తే.. డేంజర్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:57 AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(రాజ్‌ కసిరెడ్డి)కి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి...

Advocate Sidharth Luthra: బెయిలిస్తే.. డేంజర్‌

  • సాక్షులను బెదిరించి ఆధారాలను తారుమారు చేస్తారు

  • మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వసూలులో రాజ్‌ కసిరెడ్డిదే కీలకపాత్ర

  • సిట్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(రాజ్‌ కసిరెడ్డి)కి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి, ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం హైకోర్టుకు నివేదించారు. మద్యం పాలసీ రూపకల్పన నుంచి సరఫరా కంపెనీల వద్ద ముడుపుల చేసేవరకు కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. కసిరెడ్డికి ముడుపులు అందజేసినట్లు మద్యం కంపెనీల యజమానులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచామన్నారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ముతో బంగారం, భూములు కొన్నట్టు తెలిపారు. సూట్‌ కేసు కంపెనీల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించారని, పిటిషనర్‌ విదేశాలకు పారిపోతుండగా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారని వివరించారు. కేసులో నిందితులుగా ఉన్న బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌ను అరెస్ట్‌ చేయకుండా... ప్రత్యేకంగా చూస్తున్నామన్న కసిరెడ్డి వాదనలో అర్థం లేదని కోర్టుకు తెలిపారు. అప్రూవర్‌గా మారుతామని, అనుమతించాలని వారిద్దరూ కోరుతున్నట్టు చెప్పారు. అప్రూవర్‌గా మారతామన్న వ్యక్తులతో పిటిషనర్‌ పోల్చుకోవడానికి వీల్లేదన్నారు. కేసులో ఇప్పటివరకు చాలా మందిని అరెస్ట్‌ చేశామని.. వారుగానీ, పిటిషనర్‌గానీ అప్రూవర్‌గా మారుతామనలేదని చెప్పారు. నిందితులను ఎలా ‘ట్రీట్‌’ చేయాలనేది దర్యాప్తు సంస్థ విచక్షణాధికారమని, కసిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.


ఆ విషయాలే చూడండి!

రాజ్‌ కసిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు సమీపకాలంలో పూర్తికాదని తెలిసిన తర్వాత కూడా నిందితుడిని జైల్లో ఉంచడం అతని ప్రాథమిక హక్కులను హరించడమేనని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థ సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకుని బెయిల్‌ను తిరస్కరించడం, మంజూరు చేయడం వంటివి చేయకూడదన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్న కారణంగానే పిటిషనర్‌ను ఇప్పటివరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచారని, అదే కారణంతో బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని చెప్పారు. ‘‘బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా?. సాక్షులను ప్రభావితం చేస్తారా?. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందా?. అనే విషయాన్ని మాత్రమే పరిశీలించాలి.’’ అని తెలిపారు. పిటిషనర్‌ విదేశాలకు పారిపోయే అవకాశం లేదని, సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు ఆధారాలు లేవన్నారు. కేసులో అప్రూవర్లుగా మారుతారని చెబుతున్న నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను అరెస్ట్‌చేస్తే ట్రయల్‌ ముగిసేవరకు వాళ్లు జైల్లో ఉండాల్సిందేనని, ఈ కారణంతోనే అరెస్ట్‌ చేయడం లేదని చెప్పారు. కాగా, బెయిల్‌ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. దీంతో జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి.. మౌఖికంగా వినిపించిన వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని ఆదేశించారు.

Updated Date - Dec 04 , 2025 | 05:07 AM